కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును ఎట్టిపరిస్థితుల్లో వదులుకోం:డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును ఎట్టిపరిస్థితుల్లో వదులుకోం:డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క
  • ‘కాళేశ్వరం, పాలమూరు’కు కేంద్రం సాయం చేయాలి
  • జీసీ లింకులో నికర జలాలకు అదనంగా 200 టీఎంసీల వరద జలాలు ఇవ్వాలి
  • సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన చట్టబద్ధ వాటాను తేల్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మిగులు జలాలపై హక్కులను కాపాడుతూ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి 12 ఏండ్లు గడుస్తున్నా షెడ్యూల్9, 10 ఆస్తుల విభజన అంశాలు ఇంకా పెండింగ్‌‌లోనే ఉన్నాయని వాటిని పరిష్కరించాలని తేల్చిచెప్పారు. 

కేంద్ర–రాష్ట్రాల మధ్య పెండింగ్‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే నిజమైన సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని పేర్కొన్నారు. మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన 31వ సదరన్‌‌ జోనల్‌‌ కౌన్సిల్‌‌ సమావేశంలో భట్టి పాల్గొని మాట్లాడారు. వివాదాలకు ట్రిబ్యునళ్లు, కమిటీలు లేకుండా చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. తదుపరి 32వ దక్షిణ ప్రాంతీయ మండలి భేటీకి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్‌‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

వాటాను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోం

కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని విక్రమార్క స్పష్టం చేశారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా ఎగువ రాష్ట్రాలు చేపట్టే ఏకపక్ష ప్రాజెక్టులను, చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన సూత్రాలను వర్తింపజేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ–ఏపీ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) పరిధిలో ఉన్నందున, చట్టపరమైన ప్రక్రియ ద్వారా వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం సాధించాలని కోరారు. 

మిగులు జలాలపై దిగువ రాష్ట్రంగా తెలంగాణకు ఉన్న సహజ హక్కులను పరిరక్షించాలన్నారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత కేడబ్ల్యూడీటీ–2 ఉత్తర్వుల ప్రకారం ఈ విషయంలో కర్ణాటకకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ కర్ణాటకలోని కొప్పళ్ జిల్లా నావలిలో నిర్మిస్తున్న జలాశయం, అలంపూర్ మినహా ఇతర ప్రాంతాల్లో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటి హక్కులకు గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కర్ణాటక అభ్యంతరాలను ఎజెండా నుంచి వెంటనే తొలగించాలని, కృష్ణా బేసిన్‌‌లో ఆ రాష్ట్రం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు (జీసీ లింక్)లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్‌‌ను అనుసంధాన మూలంగా గుర్తించేందుకు అంగీకరిస్తూనే, తెలంగాణకు 74 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని కోరారు. కరువు ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాల కోసం 200 టీఎంసీల వరద జలాలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. 

పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు కేంద్రం ఉదారంగా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలూ ముందుకు సాగుతున్నాయని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

12 ఏండ్లుగా పెండింగ్​లోనే విభజన సమస్యలు

తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తులు, సంస్థల విభజన ఇంకా పెండింగ్‌‌లోనే ఉండటంపై భట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ సమస్యలకు తుది పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌‌లోని కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల విభజనకు సంబంధించి ఇప్పటికే 23 సంస్థలపై తెలంగాణ తన వైఖరిని, అభిప్రా యాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించిందని గుర్తుచేశారు. 

అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలి

వివాదాల పరిష్కారానికి సంబంధించిన నియమ నిబంధనలు స్పష్టంగా ఉండటంతో పాటు, అన్ని రాష్ట్రాలకూ ఒకే విధమైన నిబంధనలు సమానంగా వర్తింపజేయాలని తెలంగాణ  కోరుకుంటోందని భట్టి చెప్పారు. రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు నీటి భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల ముప్పు, వేగవంతమైన పట్టణీకరణ, రవాణా–లాజిస్టిక్స్ వ్యవస్థల బలోపేతం, ఆర్థిక పోటీతత్వం వంటి అంశాలు అత్యంత కీలకమైన సవాళ్లుగా మారనున్నాయని భట్టి హెచ్చరించారు. ఈ సంక్లిష్ట సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని భట్టి స్పష్టం చేశారు.