- ఇన్ చార్జ్ ఇంజినీర్లతోనే కరీంనగర్ కార్పొరేషన్ పాలన
- ఎస్ఈ, రెండు ఈఈ పోస్టులు ఖాళీ
- అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ రూపకల్పన, పర్యవేక్షణకు ఇబ్బందులు
- ఉన్న ఒక్క ఈఈతోనే పనులన్నీ..
- ఇంజనీర్లు లేక పనుల డిజైన్ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తిస్థాయిలో ఇంజనీర్లు లేక అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇంజనీర్ల కొరతతో అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ రూపకల్పన, పర్యవేక్షణ కరువైంది. బల్దియాలో పూర్తి స్థాయి సూపరింటెండింగ్ ఇంజినీర్(ఎస్ఈ), ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ) విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఇన్ చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.
ఇద్దరు ఈఈల స్థానంలో డిప్యూటీ ఈఈ లచ్చిరెడ్డి ఒక్కరే చక్రం తిప్పుతున్నారు. దీంతో ఇంజినీరింగ్ విభాగంలో అనేక పనులు, ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంజినీర్లు లేకుండా పనులు ఎలా ?
బల్దియాలో ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావుకు ఎస్ఈ ఫుల్ అడిషనల్ చార్జ్ అప్పగించారు. కానీ ఆయన తన చాంబర్ వైపు రావడం లేదని సమాచారం. కరీంనగర్ సిటీలో 66 డివిజన్లకుగాను 33 డివిజన్లకు
ఒక ఈఈ చొప్పున ఇద్దరు ఈఈలు ఉండాలి. కానీ ప్రస్తుతం డిప్యూటీ ఈఈ లచ్చిరెడ్డి ఇన్ చార్జ్ ఈఈగా వ్యవహరిస్తున్నారు.
ఇంజినీర్ల కొరత కారణంగా బల్దియా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లలో డూప్లికేషన్ జరగడం, కొన్ని టెండర్లు ఓపెన్ చేయకుండా పెండింగ్ లో పెట్టడం, అంచనాలు తారుమారు కావడం, పనుల్లో నాణ్యత లోపించినా పర్యవేక్షించకపోవడం వంటి పొరపాట్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక టెండర్ దక్కించుకుని అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయకపోతే నోటీసులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ తో నగరంలో పనులు చేపట్టిన ఏజెన్సీకి సగం పనులు అయ్యాక అధికారులు బిల్లులు మంజూరు చేశారు. అయినప్పటకీ మిగతా పనులు పూర్తి చేయలేదు. ఇంజనీరింగ్ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వలేదు.
ఇంజినీర్లు లేక ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.70 కోట్లతో చేపట్టే పనుల కోసం సర్వేలు, ఇన్వెస్టిగేషన్లు, ప్లానింగ్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారీ కోసం కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన కన్సల్టెన్సీకి డీపీఆర్ తయారీ కోసం సుమారు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉంటుంది.
స్మార్ట్ సిటీలో భాగంగా ప్రతిపాదించిన స్టార్మ్ వాటర్(వర్షపు నీరు) డ్రైనేజీ సిస్టం, మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం, సదాశివపల్లి జంక్షన్, స్పాంజ్ పార్క్ అభివృద్ధి, మోడల్ శ్మశానవాటిక పనుల్లో ఒకటి మినహా 4 పనులు గత స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ రూపొందించిన డీపీఆర్ లో ఉన్నవే. అయినా ఇంజనీర్ల కొరత కారణంగా కన్సల్టెన్సీని ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్పొరేషన్లో ఇంజినీర్లను నియమించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
