వెలుగు స్పెషల్ : పోరాట యోధుడు ..గుడిసెవాసుల నివాస హక్కుల కోసం ఉద్యమం

వెలుగు స్పెషల్ : పోరాట యోధుడు ..గుడిసెవాసుల నివాస హక్కుల కోసం ఉద్యమం

కష్టాలను ఎదుర్కొని ఎదగడం ఒక వ్యకి జీవిత విజయమైతే, తనలాంటి వారి కష్టాలను  తొలగించేందుకు పోరాడటం  ప్రజానాయకుడి విశిష్టత.  గడ్డం వెంకటస్వామి జీవితం ఈ రెండింటికీ నిదర్శనం.  కుటుంబ పోషణ కోసం  భవన నిర్మాణ  కార్మికుడిగా పనిచేసిన ఆయన,  గుడిసెవాసుల నివాస హక్కుల కోసం ఉద్యమించారు.   కార్మికులను  సంఘటితం చేశారు.  

తెలంగాణ ఆకాంక్షను పార్లమెంటులో వినిపించారు. అణగారిన వర్గాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించే సంస్థలను నిర్మించారు.   సమస ఎదురైన ప్రతిచోటా ప్రజలకు అండగా నిలిచి,  పరిష్కారం కోసం వివిధ మార్గాలలో  కృషి చేసిన ఆ పట్టుదలే ఆయనను ప్రజల ‘కాకా’గా నిలబెట్టింది. 

కూలీ నుంచి కేంద్ర మంత్రిగా...

తండ్రి మరణంతో చిన్న వయసులోనే  వెంకటస్వామిపై  కుటుంబ  పోషణ బాధ్యతపడింది.  చదువును  కొనసాగించలేని పరిస్థితులలో భవన నిర్మాణ కార్మికుడిగా  పనిచేశారు.  కుటుంబాన్ని నిలబెట్టేందుకు చేపట్టిన  ఆ పని ఆయనకు  శ్రమజీవుల చితికిన బతుకులను  ప్రత్యక్షంగా  పరిచయం చేసింది. ఆ అనుభవమే ఆయన ప్రజాజీవితాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైంది.  

కుటుంబ పోషణ కోసం కూలీగా పనిచేసిన యువకుడు, కార్మిక సంఘాల నాయకుడిగా,  ప్రజా
ప్రతినిధిగా,  కేంద్రమంత్రిగా ఎదిగారు. పదవులు మారినా పేదల నివాసం,  కార్మికుల సంక్షేమం,  విద్యావకాశాలు వంటి అంశాలు ఆయన కార్యాచరణలో  కొనసాగాయి.  కాకా పోరాట స్వభావాన్ని  అంచనా వేయాల్సింది  ఈ నిరంతర  ప్రజా అనుబంధం ఆధారంగానే.  దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం  స్థాపించి పోరాటం చేశారు. ఆయన పోరాటానికి దిగివచ్చిన  ప్రభుత్వం పేదలు గుడిసెలు వేసుకోవడానికి ఒప్పుకుంది. దాదాపు 80వేల మందికి పైగా పేదలకు గుడిసెల్లో గూడు దొరికింది.   

101 కార్మిక సంఘాలకు నాయకత్వం

ఐఎన్‌‌టీయూసీతో పనిచేసిన వెంకటస్వామి 1961లో రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.  వివిధ రంగాల కార్మిక సంఘాలతో అనుబంధం పెంచుకుని వారి సమస్యలను సమష్టిగా  వినిపించారు.  ఆయన దాదాపు 101 కార్మిక సంఘాలకు  ప్రత్యక్షంగా,  పరోక్షంగా నాయకత్వం వహించారు.  కార్మిక  సహకార  సంఘాలను  ప్రోత్సహించారు.   జౌళిశాఖ బాధ్యతలు నిర్వహించినకాలంలో  చేనేత రంగ సమస్యలపైనా కాకా దృష్టి  సారించారు.  చేనేత  కుటుంబాల జీవనోపాధిని కాపాడే నిర్ణయాలు తీసుకున్నారు.  బలహీన వర్గాలకు  డొనేషను లేకుండా విద్యను అందించేందుకు ఆయన చేసిన విశేషమైన కృషిని నాటి ప్రభుత్వ  ప్రచురణ ‘కురుక్షేత్ర’ ప్రచురించింది.  కార్మికుడి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ఒక రాజకీయ ధురంధరుడిగా కాకా  భారత దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా  నిలిచిపొతారు. 

దళితుల ఆత్మగౌరవం కోసం పోరాటం

 ఆది హిందూ ఉద్యమానికి బలమైన పునాదులు వేసి,  విద్యతోనూ,  సామాజిక చైతన్యంతోనూ అణగారిన ప్రజలను మేల్కొలిపిన  మాదరి భాగ్యరెడ్డి వర్మ.  నిజాం ప్రభుత్వంలో  విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన  బి.ఎస్. వెంకట్రావు,  అణగారిన వర్గాల ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై చాటిన బత్తుల శ్యాంసుందర్,  అరుంధతీయ సంఘం స్థాపించిన అరిగే రామస్వామి,  పి.ఆర్. వెంకటస్వామి,   ‘బండెనక బండి కట్టి’ బండి యాదగిరి,  అంబేద్కర్ ఆశయాలను రాజకీయ కార్యాచరణగా మలిచిన  ఈశ్వరీబాయిల పోరాటం సామాజిక చరిత్రను సుసంపన్నం చేసింది.    

కాకాను  తెలంగాణ  దళిత  ఉద్యమ పరంపరలో గుర్తించడమంటే  ఆత్మ గౌరవ పోరాటాన్ని.. నివాసం, ఉపాధి, విద్య, సామాజిక భద్రత వంటి జీవన హక్కులతో అనుసంధానించిన నాయకుడిగా అర్థం చేసుకోవడం. 

 

డాక్టర్. మంచాల లింగస్వామి, చైర్మన్, మాల ప్రజాఫ్రంట్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.