హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ..బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ..బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం
  • పునర్వవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌‌‌‌జీసీఎల్) బోర్డు ఆఫ్ డైరెక్టర్లను పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని చైర్మన్‌‌‌‌గా, హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌ను వైస్ చైర్మన్‌‌‌‌గా, హెచ్‌‌‌‌జీసీఎల్ ఎండీని మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌గా నియమించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో నంబర్ 807 జారీ చేశారు.

నామినీ డైరెక్టర్లుగా జీహెచ్‌‌‌‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌‌‌‌గిరి గ్రేటర్ కార్పొరేషన్, హైడ్రా కమిషనర్లతో పాటు హైదరాబాద్ జలమండలి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్), హైదరాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌‌‌‌ఏఎంఎల్) ఎండీని నియమించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపడుతున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం, సమగ్ర ప్రణాళిక, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం లక్ష్యంగా బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది.