బకాయిలు కట్టకుంటే జైలుకే ..సివిల్‌‌‌‌ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

బకాయిలు కట్టకుంటే జైలుకే ..సివిల్‌‌‌‌ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
  • సీఎంఆర్ మిల్లర్లకు సివిల్‌‌‌‌ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్
  • ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు వ్యాపారాలకు మళ్లించడం నేరం
  • 86 మంది మిల్లర్ల నుంచి రూ.1,500 కోట్లు రావాల్సి ఉన్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న రైస్ మిల్లర్లకు ఇదే చివరి అవకాశమని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రజాధనాన్ని ఇతర వ్యాపారాలకు మళ్లించడం నేరమని స్పష్టం చేశారు. గురువారం ఆయన వీ6 వెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు. సివిల్ సప్లైస్, విజిలెన్స్ విభాగాలు నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్‌‌‌‌లో భాగంగా ఇప్పటివరకు రూ.1,000 కోట్లకు పైగా మొండి బకాయిలను వసూలు చేసినట్లు తెలిపారు. 

ఫీల్డ్ విజిట్లలో కొంతమంది మిల్లర్లు బియ్యాన్ని అక్రమంగా తరలించి ఇతర వ్యాపారాలకు వినియోగించినట్లు తేలిందన్నారు. రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం కేటాయిస్తే ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించకుండా బయట అమ్ముకున్న కొందరు రైస్ మిల్లర్లు ఆ డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మళ్లించినట్లు గుర్తించామన్నారు. మరికొందరు ఏకంగా సినిమాల నిర్మాణానికి వినియోగించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంకా పలువురు మిల్లర్లు ధాన్యం, బియ్యం లెక్కలు, చెల్లించాల్సిన నగదుకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 86 మంది రైస్ మిల్లర్లు అతిపెద్ద డిఫాల్టర్లుగా ఉన్నారని, వారి నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.1,500 కోట్లు రావాల్సి ఉందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. బకాయిలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 84 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేయగా.. 16 మందిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై కూడా బకాయిలు చెల్లించని వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం ఖాయమని స్పష్టం చేశారు.  బకాయిలు చెల్లించాల్సిన మిల్లర్లకు ప్రస్తుతం రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని కమిషనర్ స్పష్టం చేశారు. 

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని అప్పగించి, బకాయి డబ్బులు చెల్లించడం లేదా జైలుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారు. అదే సమయంలో ప్రభుత్వ బకాయిలను చెల్లించి సహకరించే రైస్ మిల్లర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు ఇకపై సాగవని హెచ్చరించారు.