- జూన్ క్వార్టర్‌లో 102 శాతం పెరిగిన సేల్స్
- మొత్తం పీవీ అమ్మకాల్లో 8 శాతానికి ఈ– కార్ల వాటా
- కొనసాగుతున్న ఎస్‌యూవీ హవా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ బండ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హోల్‌సేల్స్ (ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు వంటివి) ఏడాది లెక్కన 102 శాతం పెరిగాయి. అదే రిటైల్ అమ్మకాలు 89 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇదే టైమ్‌లో సాధారణ ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు కేవలం 26 శాతమే పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా ) డేటా ప్రకారం, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో రికార్డ్ లెవెల్లో 12.74 లక్షల ప్యాసింజర్ బండ్ల సేల్స్ జరిగాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 82,011 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ (31,070 యూనిట్లు), మహీంద్రా (19,389 యూనిట్లు), జేఎస్‌డబ్ల్యూ ఎంజీ (15,851 యూనిట్లు) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్యాసింజర్ కార్ల రిటైల్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వాటా జూన్ నాటికి దాదాపు 7.75 శాతానికి పెరిగింది. కొత్త మోడళ్లు రావడం, కార్ల సప్లయ్ పెరగడం, పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ బండ్ల సేల్స్ పెరిగాయి.
కనెక్టెడ్ కార్లకు డిమాండ్..
పెట్రోల్, డీజిల్ కార్లలో కూడా కనెక్టెడ్ (వైఫై, ఫోన్ కనెక్ట్ చేసుకోగలిగే) కార్లకు డిమాండ్ కనిపించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘సైబర్‌మీడియా రీసెర్చ్’ (సీఎంఆర్) రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఇంటర్నెట్ ఆధారిత 'కనెక్టెడ్ వెహికల్స్' వాటా 40-–-45 శాతానికి పెరగనుంది. రియల్-టైమ్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, మొబైల్ సాఫ్ట్‌వేర్ లాగే ఇంటర్నెట్ ద్వారా కార్ల సిస్టమ్స్ అప్‌గ్రేడ్ చేసుకోగలగడం, ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుండడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. మొత్తం వాహనాల్లో 98 శాతం కార్లు రూ. 30 లక్షల లోపు ధర ఉన్న విభాగంలోనే అమ్ముడవుతున్నాయని సీఎంఆర్ రిపోర్ట్ స్పష్టం చేసింది. పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో అనేకమంది సంప్రదాయ ఐసీఈ వాహనాల కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎలక్ట్రిక్ టూవీలర్, త్రీవీలర్లు
కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ-వీలర్లు (ఈ2డబ్ల్యూ), త్రీ-వీలర్ల (ఈ3బ్ల్యూ) విభాగం చాలా వేగంగా దూసుకుపోతోంది. మొత్తం ఈవీ విక్రయాల్లో 90 శాతానికి పైగా వాటా ఈ రెండు విభాగాలదే ఉంది. ఫాడా డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో దాదాపు 5.13 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు రిజిస్టర్ అయ్యాయి. ఏడాది లెక్కన 66శాతం వృద్ధి నమోదైంది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్, ఏథర్ ఎనర్జీ అగ్రస్థానాల్లో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల సేల్స్ సుమారు 1.6 లక్షల నుంచి 1.8 లక్షలుగా ఉన్నాయి. మొత్తం వెహికల్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా ఈవీగా మారిన విభాగం ఇదే. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం త్రీ-వీలర్లలో ఎలక్ట్రిక్ ఆటోల వాటా ఏకంగా 55శాతం – 58శాతంగా ఉంది. అమ్మకాల్లో పెట్రోల్/సీఎన్‌జీని దాటేసింది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, బజాజ్ ఆటో, పియాజియో, వైసీ ఈవీ ఎలక్ట్రిక్ త్రీవీలర్ సెగ్మెంట్‌లో లీడర్లుగా ఉన్నాయి.
