- నకిలీలకు తావులేకుండా 25 రకాల సెక్యూరిటీ ఫీచర్లు
- తొలిసారిగా మెమోపై రెండు కలర్ ఫొటోలు, క్యూఆర్ కోడ్
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షలు, మేలో జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన స్టూడెంట్ల ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లను ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది సెకండియర్ విద్యార్థులకు సంబంధించిన మెమోలను గత రెండు రోజులుగా అన్ని జిల్లాలకు డిస్పాచ్ చేశారు. దీనిలో జనరల్ స్ట్రీమ్ విద్యార్థులు 3.50 లక్షల మంది ఉండగా, ఒకేషనల్ స్ట్రీమ్ వారు 50 వేల మంది వరకు ఉన్నారు. గతంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వచ్చే సర్టిఫికెట్లు.. ఈసారి ముందుగానే అందుబాటులోకి రావడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టేలా..
సర్టిఫికెట్ల ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టేలా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. గతంతో వరదల్లో మెమోలు నానిన ఘటనల నేపథ్యంలో నాన్ టెరెబుల్ తోపాటు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల బెడద లేకుండా దాదాపు 25 రకాల పకడ్బందీ సెక్యూరిటీ ఫీచర్లను ఈ మెమోల్లో పొందుపరిచారు. గతంలో 15 మాత్రమే ఉండగా.. ఈసారి మరో పది ఫీచర్స్ పెంచారు. ప్రధానంగా సర్టిఫికెట్‌పై రెండు కలర్ ఫొటోలు ఉంటాయి. ఒకటి క్లియర్ ఫొటో కాగా, రెండోది సెక్యూరిటీ కోసం వాడే ‘కోడెడ్’ ఫొటో ఉంటుంది.
ప్రతి మెమోపై క్యూఆర్ కోడ్, బార్ కోడ్ తోపాటు బోర్డుకు సంబంధించిన ఇంటర్నల్ లోగోను ముద్రించారు. కొన్ని రహస్య సెక్యూరిటీ గుర్తులను కేవలం యూవీ లైట్‌లో చూసినప్పుడు మాత్రమే కనిపించేలా ఏర్పాటు చేశారు. దీంతో డూప్లికేట్ సర్టిఫికెట్లు సృష్టించడం అసాధ్యమని బోర్డు వెల్లడించింది. కొత్త మెమోలను అన్ని జిల్లా ఇంటర్ ఆఫీసులకు పంపించారు. వీటిని జూనియర్ కాలేజీల వారీగా ప్యాక్ చేసి ప్రిన్సిపాల్స్‌కు హ్యాండోవర్ చేస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ కాలేజీ ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ సూచించారు.
