ప్రమాద ఘంటికలు మోగుతున్నయ్‌.. బాధితులు కోర్టు మెట్లెక్కుతున్నారు:హైకోర్టు వ్యాఖ్యలు

ప్రమాద ఘంటికలు మోగుతున్నయ్‌..  బాధితులు కోర్టు మెట్లెక్కుతున్నారు:హైకోర్టు వ్యాఖ్యలు
  • రిటైర్డ్​ ఉద్యోగులకు పెన్షన్‌ ప్రయోజనాలు అందడంలేదు
  • ఇది రాజకీయ చర్చకాదు.. పార్టీలు, వ్యక్తులతో సంబంధంలేదు
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక విధుల వ్యవహారాల్లో కోర్టుల జోక్యం చేసుకోవని.. అయితే, చెల్లింపుల ప్రాధాన్యంలో ప్రజల హక్కులకు సంబంధించిన అంశం కావడంతోనే ప్రశ్నిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి భూమి ఇచ్చిన బాధితులకు పరిహారం అందక కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలు చేస్తున్నారని, అంతేకాకుండా పదవీ విరమణానంతర ప్రయోజనాలు, పెన్షన్‌ అందక కోర్టులకు వస్తున్నారంది.

కోర్టుల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకే జీతాలు అందలేదని ఫిర్యాదు చేసిన స్వీయ అనుభవం ఎదురైందని వ్యాఖ్యానించింది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హెచ్చరించింది. భూసేకరణ బాధితులకు పరిహారం చెల్లింపునకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అంతేగాకుండా సంక్షేమ పథకాల అమలుకు చేసిన రుణాలు ఇతర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల నిమిత్తం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ భూసేకరణ పరిహారానికి సంబంధించి ఈ రోజు 19 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 3 కేసుల్లో టోకెన్‌లు జారీ అయ్యాయని, మొత్తం కోర్టు ధిక్కరణ కేసుల వివరాలను సమర్పించడానికి గడువు అవసరమన్నారు. ప్రస్తుత కేసులో కౌంటరు దాఖలు చేయకపోవడం వల్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అమలుపై ఈ కోర్టు స్టే ఇచ్చిందని, స్టేను తొలగించాలని పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. 

అధికరణ 162ను వక్రీకరిస్తారా

ఈ దశలో అఫిడవిట్‌లో అధికరణ 162ను వక్రీకరించి రాయడాన్ని గుర్తించిన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేస్తూ అధికరణ 162 గురించి చెబుతున్నామంటూ పొంతనలేనిదాన్ని ఎలా పేర్కొంటారని నిలదీసింది. రాజ్యాంగ కోర్టులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాయన్నారు. సంతకం చేసే ముందు కనీసం పరిశీలించరా అంటూ నిలదీశారు. ఏఏజీ స్పందిస్తూ ఇది ముద్రారాక్షసమని, పొరపాటు జరిగిందని, సరిదిద్దుతామని తెలిపారు.

దీన్ని వదిలి మిగిలిన అంశాలపై వాదనలను వినాలనగా న్యాయమూర్తి నిరాకరిస్తూ ఇది తీవ్రమైన అంశమని, అఫిడవిట్‌ దాఖలు చేశాకే విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై స్టే ఎత్తివేతకు తిరస్కరించారు. పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించామని ఉద్యోగులకు 4 పీఆర్‌సీలు, 6 డీఏలు అందలేదని, ఇటీవల ఎల్‌బీనగర్‌లో కాంట్రాక్ట్‌ బిల్లు రాలేదని ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకోగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరామర్శించారన్నారు.

దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ దీనికీ ఈ పథకాల అమలుకు పొంతన ఏమిటో చెప్పకుండా పరిగణనలోకి తీసుకోలేమన్నారు. ఈ వాదనపై ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. కోర్టులను రాజకీయ వేదికలు చేయరాదని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ పథకాలకు సంబంధించిన పరిశీలన ప్రస్తుతానికి పరిమితం కాలేదని, 2014 నుంచి పథకం అమలు తీరును సమీక్షిస్తున్నామన్నారు.

ఇదేమీ రాజకీయ చర్చకాదని, ఏ రాజకీయ పార్టీ, వ్యక్తులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన అంశాల గురించే చర్చిస్తున్నామని, ప్రజల హక్కులకు సంబంధించినదని తేల్చి చెప్పారు. హక్కులపై ఏ ఒక్కరు కోర్టును ఆశ్రయించినా జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేస్తూ బీసీ సంక్షేమశాఖతోపాటు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులను అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 24కు వాయిదా వేశారు.