అమ్మ కష్టం మా ఇద్దరికే తెలుసు: రాజీవ్ జయంతి వేళ రాహుల్ గాంధీ భావోద్వేగం

అమ్మ కష్టం మా ఇద్దరికే తెలుసు:  రాజీవ్ జయంతి వేళ రాహుల్ గాంధీ భావోద్వేగం
  • ప్రతి సవాల్‌‌నూ ఆమె ధైర్యంతో ఎదుర్కోవడం కళ్లారా చూశా 
  • రాజీవ్ జయంతి వేళ రాహుల్ గాంధీ భావోద్వేగం 
  • తల్లి ఆటోబయోగ్రఫీ పట్ల గర్విస్తున్నట్లు వెల్లడి
  • లవ్ యూ మా.. నీ గురించి చాలా గర్వపడుతున్నా: ప్రియాంక

న్యూఢిల్లీ: తన తల్లి సోనియా గాంధీ జీవిత కథ నవంబరు 10న పుస్తక రూపంలో రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. 1991 నుంచి జీవితంలో ఎదురైన ప్రతి సవాల్‌‌నూ ఆమె ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూశానని వెల్లడించారు. సోనియా గాంధీ జీవిత కథను ఆమెను ప్రేమించే కోట్లాది మంది ప్రజలు చదవబోతున్నారనే విషయం చాలా సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందని తెలిపారు. 

రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా రాహుల్ గురువారం ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు. ‘‘అమ్మా.. నిన్ను, నాన్ననూ కలిసి చివరిసారి చూసి 35 ఏండ్లు దాటింది. 1991లో మా నాన్న రాజీవ్ గాంధీ మరణించినప్పటి నుంచి జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని, ఎదురైన ప్రతి సవాల్‌‌నూ నా తల్లి సోనియా గాంధీ ధైర్యంతో, ఆత్మగౌరవంతో ఎదుర్కోవడం కళ్లారా చూశాను. 

ఆమె అనుభవించిన కష్టాలు..వాటిని ఎదుర్కోవడానికి పడిన వేదన కేవలం నాకు, ప్రియాంకకు మాత్రమే పూర్తిగా తెలుసు. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ బహిరంగంగా చెప్పేందుకు ఇష్టపడని ఆమె.. ఇప్పుడు తన జీవిత విశేషాలను ప్రపంచంతో పంచుకోవడం కోసం 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే ఆటోబయోగ్రఫీ రాశారు. ఈ కథను అందరికీ చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు.  నిన్ను ప్రేమించే లక్షలాది మంది ప్రజలు చివరకు నీ కథను ఈ పుస్తకం చదివి తెలుసుకోబోతున్నారని గర్విస్తున్నాను.

 నేడు నాన్న పుట్టినరోజు. ఆయన స్వర్గం నుంచి తన అందమైన సోనియా వైపు చూస్తూ గర్వంగా చిరునవ్వు చిందించడం నాకు కనిపిస్తోంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థుల గురించి ప్రస్తావిస్తూ.. స్టూడెంట్లు ఇప్పుడు తమ భావాలను వ్యక్తీకరించడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారని , వారిని ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో మార్పులు తీసుకురావడానికి యువశక్తిని ఉపయోగించుకోవాలని కోరారు. మైనారిటీలపై  బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తున్నాయని, గిరిజనులను, దళితులను అణచివేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

వాళ్ల బంధం గొప్ప ప్రేమకథల్లో ఒకటి.. 

తన తల్లిదండ్రుల బంధం గొప్ప ప్రేమకథల్లో ఒకటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అభివర్ణించారు. తన తండ్రి రాజీవ్ బ్రతికి ఉంటే.. తన తల్లిని చూసి గర్వపడేవారని తెలిపారు. ‘‘నా తల్లిదండ్రుల బంధం మన కాలపు అత్యంత గొప్ప ప్రేమకథల్లో ఒకటి. దాన్ని కళ్లారా చూసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. లవ్ యూ మా..నీ గురించి చాలా చాలా గర్వపడుతున్నాను’’ అంటూ ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు.