న్యూఢిల్లీ: ఐపీఎల్ 2027 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ మంగళవారం (అక్టోబర్ 6) అధికారికంగా ప్రకటించింది. ఇట్స్ టైమ్ ఫర్ దాదాగిరి అంటూ ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.
ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ స్థానంలో దాదా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు గంగూలీ ఈ ఫ్రాంచైజీకి మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరించారు. 2027 సీజన్ నుంచి హెడ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు. దాదా ఐపీఎల్ హెడ్ కోచ్‌గా పని చేయనుండటం ఇదే తొలిసారి.
ఇప్పటి వరకు 19 ఐపీఎల్ సీజన్లు ముగియగా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కెప్టెన్లు, కోచ్‌లు మారిన ఆ జట్టు రాత మాత్రం మారలేదు. దీంతో వచ్చే సీజన్లోనైనా ఎలాగైనా టైటిల్ గెలవాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది.
►ALSO READ | హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై
ఈ నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే దిగ్గజ క్రికెటర్ గంగూలీకి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. 19 ఏండ్లుగా ఢిల్లీకి అందని ద్రాక్షగా మారిన ఐపీఎల్ టైటిల్ కల దాదా శిక్షణలోనైనా నేరవేరుతుందో లేదో చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ నాకు చాలా ఇష్టమైన ఫ్రాంచైజీ: గంగూలీ
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా నియామకం కావడంపై సౌరవ్ గంగూలీ స్పందించారు. ‘‘ఐపీఎల్‌లో హెడ్ కోచ్ పాత్రను చేపట్టడానికి నేను ఎదురుచూస్తున్నా. ఢిల్లీ క్యాపిటల్స్ నాకు చాలా ఇష్టమైన ఫ్రాంచైజీ. ఢిల్లీ ఫ్రాంచైజీతో నాకు చాలా సంవత్సరాలుగా బలమైన సంబంధం ఉంది. యజమానులు, యాజమాన్యం, సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో కలిసి పనిచేశాను. అందుకే ఈ బాధ్యత నాకు చాలా ఉత్సాహాన్నిస్తుంది. మాది ప్రతిభావంతులైన ఆటగాళ్ల బృందం. ఇటీవలి కాలంలో మేము మంచి క్రికెట్ ఆడాము. కొత్త సీజన్‌లో జట్టుతో కలిసి పనిచేయడానికి బలమైన, నిర్భయమైన జట్టును నిర్మించడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని దాదా పేర్కొన్నారు.
