న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి ఆమె గుడ్ బై చెప్పారు. మంగళవారం (అక్టోబర్ 6) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ నిర్ణయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ సాధారణ క్రీడాకారురాలిగా జట్టులో కొనసాగనున్నట్లు హర్మన్ స్పష్టం చేశారు.
‘‘భారత మహిళల క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఈ రోజుతో నేను తప్పుకుంటున్నాను. ఇది నాకు అంత సులువైన నిర్ణయం కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు దాగి ఉన్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను ఒక సాధారణ ప్లేయర్‌గా భారత జట్టు తరఫున కొనసాగుతా. నాయకత్వం ముగిసింది. కానీ నా ప్రయాణం కొనసాగుతుంది’’ ఈ సందర్భంగా హర్మన్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా జట్టు స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. భారత్‌కు గోల్డ్ మెడల్ అందించిన రోజుల వ్యవధిలోనే ఆమె ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా స్మృతి..!
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్ బై చెప్పడంతో నెక్ట్స్ సారథి ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుత వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మందనాకు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. హర్మన్ నేతృత్వంలో టీమిండియా 2025 వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే.
