పార్లమెంట్ టూ ఈసీ ఆఫీసుకు విపక్ష ఎంపీల ర్యాలీ: సైన్యం తరహాలో 2 కిలోమీటర్లు మోహరించిన పోలీసులు

పార్లమెంట్ టూ ఈసీ ఆఫీసుకు విపక్ష ఎంపీల ర్యాలీ: సైన్యం తరహాలో 2 కిలోమీటర్లు మోహరించిన పోలీసులు

న్యూఢిల్లీ: ఈసీ పనితీరు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ సేమ్ డెమొక్రసీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయ ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ భవనం నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీగా బయలుదేరారు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర సైన్యం తరహాలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 

ఈసీ కార్యాలయం, పార్లమెంట్ వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. పార్లమెంట్, ఈసీ కార్యాలయ పరిసరాలు మొత్తం పోలీసుల భద్రతా వలయంలో ఉన్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష కూటమి ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పార్లమెంట్, ఈసీ కార్యాలయ పరిసరాల్లో హై టెన్షన్ నెలకొంది. శాంతియుతంగా చేస్తోన్న ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని విపక్షాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. 

దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీ ఆకాశ వాణి భవన్ దగ్గరకు చేరుకోగానే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. జ్ఞానేష్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని రాహుల్, విపక్ష నేతలు నినాదాలు చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో.. కేవలం 200 మీటర్ల దూరంలో నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా నిరసనలో పాలు పంచుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా నిరసన జరుగుతున్న దగ్గరకు వెళ్లి విపక్షాల నిరసనకు మద్దతు తెలిపారు. ఇండియా కూటమి నేతలంతా 'ఓట్ చోర్' అని నినదించారు.