న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సేవ్ డెమొక్రసీ పేరుతో ఈసీ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన వీరిని జీఎస్టీ భవన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, విపక్ష కూటమి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న ప్రతిపక్ష ఎంపీలను బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్షాల ఆందోళన, అరెస్టులతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈసీ పనితీరు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ మంగళవారం (అక్టోబర్ 6) సేమ్ డెమొక్రసీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయ ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో విపక్ష కూటమి ఎంపీలను జీఎస్టీ భవన్ దగ్గర బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎంపీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు నినాదాలు హోరెత్తించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకం ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఓట్ చోరీకి పాల్పడుతోన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ పునరుద్ఘాటించారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్, విపక్ష కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
