కొండా కుటుంబాన్ని క్షమించొద్దు..బిడ్డతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నరు

కొండా కుటుంబాన్ని క్షమించొద్దు..బిడ్డతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నరు
  •     పీసీసీ మహిళా చీఫ్‍ ఎర్రబెల్లి స్వర్ణ

వరంగల్‌‌‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో పాటు మంత్రులపై ఇష్టారీతిన మాట్లాడుతున్న కొండా కుటుంబాన్ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లో క్షమించకూడదని పీసీసీ మహిళా చీఫ్‌‌‌‌ ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్​ హైకమాండ్​కు సూచించారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్‌‌‌‌ ప్రభుత్వ, పార్టీ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గురువారం గ్రేటర్‌‌‌‌ డీసీసీ భవన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌ నాగరాజు, హనుమకొండ, వరంగల్‌‌‌‌ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి, అయూబ్‌‌‌‌, మాజీ మేయర్‌‌‌‌ గుండు సుధారాణితో  కలిసి స్వర్ణ మాట్లాడారు. కొండా కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులు అనుభవిస్తూ ప్రతిసారీ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

టీడీపీ, కాంగ్రెస్‌‌‌‌, వైఎస్సార్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, తిరిగి కాంగ్రెస్‌‌‌‌ పార్టీల్లో కొనసాగిన కొండా కుటుంబం తమను ‘అచ్చ కాంగ్రెస్‌‌‌‌’గా చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. గతంలోనూ సుస్మిత పటేల్‌‌‌‌ సీఎం రేవంత్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకోవాలని కోరినా హైకమాండ్‌‌‌‌ అవకాశం ఇచ్చిందన్నారు. ఈసారి మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

కొండా బలమెంతో ఎంపీ ఎన్నికల్లో తేలింది: బస్వరాజు సారయ్య

కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో చిన్నాపెద్దలను గౌరవించే సంస్కృతి ఉందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సమస్యలు ఉంటే హైకమాండ్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లాలి తప్ప పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రం నుంచి కాకా వెంకటస్వామి వంటి సీనియర్‍ నేతలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియాగాంధీ ముందు బలంగా వినిపించారే తప్ప పార్టీ లైన్‍ ఎక్కడా దాటలేదని గుర్తుచేశారు.

 బీసీ నేతలను ఎదగకుండా చేసే కొండా కుటుంబం బీసీ కార్డుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. తమ బలం గురించి మాట్లాడుతున్న కొండా దంపతులు ఇటీవల ఎంపీ ఎన్నికల్లో వరంగల్‌‌‌‌ తూర్పు నుంచి ఎన్ని ఓట్లు తెప్పించారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. వారిపై చర్యలు తీసుకోకుంటే వరంగల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ కేడర్‌‌‌‌ సహించబోదన్నారు.

సహించేది లేదు: ఎమ్మెల్యే నాగరాజు

పార్టీలో ఉంటూ పార్టీని, పార్టీ పెద్దలను విమర్శించే వారు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌ నాగరాజు హెచ్చరించారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలకు డిమాండ్‌‌‌‌ చేశామని, హైకమాండ్‌‌‌‌పై గౌరవంతో అప్పట్లో మౌనంగా ఉన్నామని తెలిపారు. 

ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. సుస్మిత పటేల్‌‌‌‌ సభలో పాల్గొన్న పార్టీ పదవుల్లో ఉన్న నేతల వివరాలను టీపీసీసీకి పంపాలని సూచించారు. సమావేశంలో పార్టీ నేతలు మార్క విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌, రామకృష్ణ, రవళి, తోట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.