తెలంగాణలో భూమిమీద పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత కూడా భూ పోరాటాలు జరిగాయని చరిత్ర చెబుతున్నది. ఆశ్చర్యంగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినాక భూమి అన్యాక్రాంతం అవుతున్నది. తెలంగాణావాసులు భూమిహీనులుగా మారుతున్నారు. ఏండ్లుగా తరతరాల నుంచి భూమిలేనివారు ఒక రకమైన సమాజం కాగా, ఉన్న భూమిని పోగొట్టుకుని భూమిలేనివాళ్లుగా, పేదరికంలోకి నెట్టివేస్తున్న అసంఖ్యాకుల గురించి తెలంగాణ ఉద్యమంలో ప్రస్తావన ఉన్నా ప్రస్తుతం మాత్రం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భూమిహీనుల సంఖ్య పెరుగుతున్నది. భూమికి ధరలు పెరిగినకొద్దీ అదే తీరున భూమి లేనివారు పెరుగుతున్నారు. సర్కారును అడ్డం పెట్టుకుని, చట్టాలను కాలరాసి, నిబంధనలను అతిక్రమించి, అధికారుల అండదండలతో, అభివృద్ధి సాకుగా భూదోపిడీ జరుగుతున్నది.
రాష్ట్ర ప్రజల ఆకలిని తీ రుస్తున్న రైతులను భూమి నుంచి దూరం చేసే విధానాలు, ఉత్తర్వులు, ప్రాజెక్టులు కోకొల్లలుగా వస్తున్నాయి. తెలంగాణలో ఎకరా భూమి వందల కోట్లకు చేరింది అని తమ ఘనతగా ప్రకటించుకుంటున్న పాలకులు ఆ ధర మేరకు సంపద ఆయా రైతులకు ఎందుకు చేరట్లేదు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలేదు. ఇప్పటికీ రైతులను ఒత్తిడి చేసి, దగాచేసి, భయపెట్టి, బాధపెట్టి భూములను గుంజుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు.
భూ యాజమాన్యంలో అసమానతలు
అక్రమార్కులకు వత్తాసు పలికే వ్యవస్థకు నాంది పలికి, భూ యాజమాన్యంలో అసమానతలు సృష్టిస్తున్నారు. జీవో111 పరిధిలో ఉన్న 84 గ్రామాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవాడల పేరిట, రోడ్డు విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూములమీద ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. భూమి ఒక వినిమయ వస్తువుగా, పెట్టుబడికి అనువుగా మార్చి, భూమితో ఉండే అనుబంధాన్ని వ్యాపారంగా మార్చిన చరిత్రలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ప్రాథమిక సమిధలుగా మారినాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 2.76 కోట్ల ఎకరాల తెలంగాణ భూభాగంలో ప్రభుత్వం భూమి ఎంత? ఇదివరకు ఎంత ఉండేది వెల్లడించాలి.
తెలంగాణలో 1.06 కోట్ల ఎకరాలు వ్యవసాయం కాగా, 61.77 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఇంకొక 34.59 లక్షల ఎకరాల పడావు భూమిగా, 22.23 లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కంప్యూటరీకరణ చేసిన భూమి విస్తీర్ణం మీద కూడా వివరాలు లేవు. వివిధ ప్రభుత్వ విభాగాలకు తమ అధీనంలో ఉన్న భూముల వివరాలు తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ( టీజీఐఐసీ)కు వేల ఎకరాల భూములు ఉన్నాయి. అయితే, ఎక్కడ ఎంత ఉన్నాయి అని ఇప్పటివరకు దానిమీద ఆడిట్ చేయలేదు.
ప్రభుత్వ భూముల రికార్డులు అస్తవ్యస్తం
రెవెన్యూ, నీటిపారుదల, అటవీ, వక్ఫ్, ఎండోమెంట్స్ మొదలైన ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని భూ రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదు. అనేక ప్రభుత్వ సంస్థలు కూడా భూముల సర్వే చేయలేదు. ప్రభుత్వం లీజు లేదా కౌలు కింద ఇచ్చిన భూములకు రికార్డులు లేకపోవడంతో లీజుదారులు ‘సొంతం’ చేసుకున్నారు. మందీమార్భలం, నిధులు ఉన్న ప్రభుత్వ భూముల రికార్డులు అస్తవ్యస్తం కాగా... రైతులు, ఇతరులు తమ భూములకు సంబంధించిన రికార్డులను మంచిగా భద్రపరుస్తున్నారు. ప్రభుత్వ భూ రికార్డులు కనుమరుగు అవుతున్నందున వీటిని ప్రామాణికం చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఒకప్పుడు గ్రామాలవారీగా నమోదు చేసే రికార్డులు ఇప్పుడు కనిపిస్త లేవు.
ధరణి రికార్డుల ప్రక్షాళన చేయలేదు
ప్రజలు గ్రామస్థాయిలో నిర్వహించుకునే వ్యవస్థ కంప్యూటర్లలోకి చేరింది. గ్రామీణులకు దూరం అయ్యింది. 2013 నాటికే 10,829 గ్రామాలలో 1,32,80,649 రికార్డులు కంప్యూటరీకరణ అయిపోయినట్టు ప్రభుత్వ నివేదిక చెబుతున్నది. తరువాత ధరణి వచ్చింది. దాని ద్వారా భూ రికార్డులు ప్రక్షాళన చేసి, కొత్త పాస్‌బుక్‌లు కూడా ఇచ్చారు. ధరణి ద్వారా డిజిటల్ రికార్డులలోకి మారిన భూములు ఏ పాత రికార్డు ఆధారంగా చేశారో ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించలేదు. దాదాపు 39 రకాల భూమి రికార్డులు ఉండగా, రైతుల దగ్గర పాసుబుక్కులు ఉండగా, ధరణిలో మాత్రం కొత్త పేర్లు రావడం అప్పట్లోనే సంచలనంగా మారింది.
ధరణిలో అవకతవకలు, చట్ట ఉల్లంఘనలు, అక్రమాలు ఎండగట్టడానికి ప్రభుత్వం చేసింది ఏమీలేదు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతి కేవలం నామకరణ మార్పుకే పరిమితం అయ్యింది. గడిచిన రెండున్నర సంవత్సరాలలో ధరణి రికార్డుల ప్రక్షాళన చేయలేదు. యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేయడానికి 2020లో ప్రభుత్వం 24,400 మంది అధికారులను నియమించింది. ఒక దశలో 75.75 లక్షల ఆస్తులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆ తరువాత ఇప్పటివరకు ఎన్ని ఆస్తులు నమోదయ్యాయో ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు.
జవాబుదారీతనం ప్రతిబింబించని భూభారతి
డిజిటల్ రికార్డుల వల్ల నిరంతర అవినీతికి ఆస్కారం ఏర్పడింది. టైటిల్ గ్యారంటీ ఇంకా పలుచన అయిపోయింది. కంప్యూటర్లో నిక్షిప్తం అయిన సమాచారం అందుబాటులో ఉన్నవాడిదే భూమి అయిపోయింది. ధరణి పోర్టల్ వచ్చినాక ఒక ఆపరేటర్ సులువుగా భూమి యజమాని పేరు మార్చి ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ధరణి స్థానంలో 2025 తెచ్చిన భూ భారతిలో సంప్రదింపులు జరిపినా ప్రజలు, అనుభవజ్ఞులు ఇచ్చిన సూచనలు పట్టించుకోలేదు. ధరణి వల్ల అన్యాయం అయినవారి పేర్లు, వారికి అన్యాయం చేసినవారిమీద విచారణ చేయకపోవడం పెద్ద పొరపాటు.
ధరణి వల్ల నష్టపోయిన రైతులు, ఇతరులకు పరిహారంగా, నష్టాలు చేకూర్చిన వ్యవస్థ పట్ల జవాబుదారీతనం భూ భారతి ప్రతిబింబించలేదు. ధరణి ద్వారా జరిగిన అవినీతిని వెలికి తీయడానికి కొత్త చట్టాన్ని ఉపయోగించలేదు. జవాబుదారీతనం భూభారతి చట్టం ద్వారా చేయలేదు. అందుకే ప్రస్తుతం చర్చిస్తున్న సెక్షన్ 22A సమస్య ఉత్పన్నమయ్యింది. భూమి విలువ పెరుగుతున్నప్పుడు, భూములు ఒక వ్యాపార వస్తువుగా మార్చిన తరుణంలో, చట్టం ఉల్లంఘనలకు శిక్షించే నిబంధన కచ్చితంగా ఉండాల్సిందే.
శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్ ఫార్మా సిటీ భూసేకరణలో అయితే కోర్టు స్టే ఆర్డర్ ఉండగా ఆ భూములను టీజీఐఐసీ పేరుమీద బదలాయించారు. కోర్టు ఇది సరిచేయమని ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటికీ సరిచేయలేదు. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే 77 వేలకు పైగా సెక్షన్ 22A దరఖాస్తులు ఉండడానికి ఈ తరహా భూసేకరణ ఒక కారణం కావచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూ పరిపాలన మీద ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒక క్రమ పద్ధతిలో రికార్డులను సరి చేసుకుంటూ, చట్టాన్ని సవరిస్తూ, తగిన నిబంధనలను రూపొందిస్తే ఫలితాలు ఉంటాయి.
సెక్షన్ 22A సమస్య తీవ్రతరం అయినాక ఇప్పుడు మళ్లీ ఆర్ఓఆర్ చట్టం సవరణ చేయాలని అనేకమంది సూచిస్తున్నారు. తెలంగాణలో భూమి రికార్డులకు సంబంధించి అనేక కొత్త సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఆర్ఒఆర్ చట్ట సవరణ అత్యంత అవసరం.
నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాల ప్రైవేట్ భూమి
రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తుల వివరాలు పెట్టకపోవడం కూడా ఇప్పటి సమస్యకు ఒక కారణం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా, లక్షలాది ఎకరాల ప్రైవేట్ భూమిని భారత రిజిస్ట్రేషన్ చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితాలోని సెక్షన్ 22-ఎ కింద చేర్చారు. దీంతో నిజమైన యజమానులు తమ ఆస్తులను రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు.
నిషేధిత ఆస్తుల సమస్యను సమీక్షించిన రెవెన్యూ మంత్రి స్వయంగా అధికారులు తీవ్రమైన తప్పులు చేశారని అంగీకరించడంతో సమస్య ప్రభుత్వం దగ్గరనే ఉంది అని రుజువు అయ్యింది. తేలింది ఏమంటే, దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ భూ గరిష్ఠ పరిమితి కింద కొంత మొత్తాన్ని వసూలు చేసి భూములను క్రమబద్ధీకరించింది, కానీ ఈ భూభాగాలను ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాల కోసం ఒక నిర్దిష్ట సర్వేలోని కొంత భాగాన్ని ఒక ప్రాజెక్ట్ కోసం సేకరించినప్పటికీ, రెవెన్యూ అధికారులు మొత్తం సర్వే నంబర్‌ను ప్రభుత్వ భూమిగా నమోదు చేసి, మిగిలిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా నిరోధించారు.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
