పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మహేంద్రనగర్‌కు చెందిన బొల్లె శ్రీనివాస్, భాగ్యమ్మ దంపతులు. ప్రసవం కోసం ఈ నెల 12న భాగ్యమ్మను గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, అదే రోజు రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది.
కాన్పు సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు కుడిచేతికి తీవ్ర గాయమై ఎముక విరిగిందని బాధితులు ఆరోపించారు. అనంతరం బిడ్డ ఆరోగ్యం క్షీణించడంతో ఎన్‌ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించి ఈ నెల 18న రాత్రి 10:30 గంటలకు శిశువు మృతి చెందాడు. డాక్టర్లు, స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబసభ్యులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ తెలిపారు.
ఈ ఘటనపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టినట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి డీఎంఈ ప్రొఫెసర్ వాణి బాధితులతో మాట్లాడి, బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
