- పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కు మంత్రి కొండా సురేఖ వివరణ
- కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలపై తన కుమార్తె కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని, ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
బుధవారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ హోదాలో తనకు మల్లు రవి పంపిన షోకాజ్ నోటీసులకు మంత్రి లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న వరంగల్ జిల్లా గీసుకొండలో కాంగ్రెస్ కార్యకర్తలు, తన అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకలు కార్యక్రమానికి తన కూతురు సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని సురేఖ స్పష్టం చేశారు.
కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయంగా మరొకరిని బాధ్యతవహించాలని కోరడం సరైంది కాదన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేస్తూ నోటీసు పంపించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆ లేఖలో మంత్రి సురేఖ వివరించారు. కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందన్నారు.
ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకొని, వాస్తవ పరిస్థితులను తెలుసుకొని..ఈ విషయంలో తన ప్రమేయం ఎంత మాత్రం లేదని గుర్తించాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపిన వివరణ లేఖలో విజ్ఞప్తి చేశారు.
