ఫ్రీ కార్లు మాకొద్దు.. CM విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన డీఎంకే

ఫ్రీ కార్లు మాకొద్దు.. CM విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన డీఎంకే

చెన్నై: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికి ఉచితంగా కార్లు ఇస్తామన్న సీఎం విజయ్ ప్రతిపాదనను ప్రతిపక్ష డీఎంకే పార్టీ తిరస్కరించింది. ఫ్రీ కార్లు తమకు వద్దని అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పింది. రాష్ట్రంలో అప్పుల్లో ఉందని చెబుతూనే ఈ దుబారా ఖర్చులు ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పటికే అప్పుల్లో కురుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం మోపవద్దని హితవు పలికింది. ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితులపై వారి అఫిడవిట్లు పరిశీలించాకే ఉచితంగా కార్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలందరికీ ఉచితంగా కార్లు ఇస్తామన్న సీఎం ప్రతిపాదనను డీఎంకే తిరస్కరిస్తోందని తెలిపారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెబుతుంది.. అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.

59 మంది డీఎంకే ఎమ్మెల్యేలు ఫ్రీ కార్లు తీసుకోవద్దని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఇప్పటికే కార్లు ఉన్నాయా.. వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అన్న విషయాలను.. వారి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఉచిత కార్లను అందించాలని కోరుతున్నామన్నారు. దుబారా ఖర్చులు చేసి ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చవద్దని ప్రభుత్వానికి సూచించారు.

కార్లు ఉన్నోళ్లు తీసుకోనవసరం లేదు: ప్రభుత్వం

సీఎం విజయ్ ఫ్రీ కార్ల ప్రతిపాదనను డీఎంకే రిజెక్ట్ చేయడంపై మంత్రి అధవ్ అర్జున తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పునరుద్ఘాటించారు. వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీల వంటి చిన్న పార్టీలకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు పేద ఆర్థిక స్థితిలో ఉన్నారని అన్నారు. వారికి కార్లు విలాస వస్తువులు కాదని.. తమ నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాలను సందర్శించడానికి అవి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. 

►ALSO READ | కంప్లయింట్ ఇస్తే తీసుకోరా : పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ ధర్నా

అయితే, ఇప్పటికే కారు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వ వాహనం కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై రుణ భారం మోపడం ఇష్టం లేదంటూ ప్రభుత్వం అందించే ఫ్రీ కారు వద్దంటున్న ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మూడు వ్యక్తిగత బంగ్లాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.