ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో వాదనలు కంప్లీట్.. సెప్టెంబర్ 16న తీర్పు

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో వాదనలు కంప్లీట్.. సెప్టెంబర్ 16న తీర్పు

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. 2026, సెప్టెంబర్ 16న తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. దీంతో హైకోర్టు నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్ కుమార్‎పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీ జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కే సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. 

బీజేపీ, బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాదులు కే. వివేక్ రెడ్డి, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ.. పిటిషన్లను కొట్టివేయడానికి స్పీకర్ పరిగణనలోకి తీసుకున్న ఆధారాలను పిటిషనర్లకు అందజేయలేదని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి అనంతరం మరో పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పేర్కొన్నారు. 

►ALSO READ | ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్ ఫోర్స్ అధికారుల సర్వే

ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని రాజ్యాంగం నేరుగా నిషేధించకపోయినా, పార్టీ మారితే పదో షెడ్యూల్ కింద అనర్హత వర్తించే అవకాశం ఉందన్నారు. అనర్హతకు కేవలం వార్తా కథనాలనే ఆధారంగా తీసుకోలేదని, ఎన్నికల గెజిట్లు, అధికారిక పత్రాలు, నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఫారం-26 అఫిడవిట్లను ఆధారాలుగా సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ వార్తా కథనాల మూలాలు, రిపోర్టర్లు, ఎడిటర్ల వివరాలు ఇవ్వలేదని స్పీకర్ తీర్పులో పేర్కొనడం సరికాదన్నారు.

సదరు ఎమ్మెల్యేలు పార్లమెంట్, ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్‎కు అనుకూలంగా ప్రచారం చేశారని తెలిపారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని ఏఐసీసీ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వీడియోలు, మీడియా కథనాలను కోర్టుకు సమర్పించారు. 

మరోవైపు.. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాదులు వాదించారు. సీఎంను కలిసిన సమయంలో కప్పుకుంది కాంగ్రెస్ పార్టీ జెండా కాదని.. జాతీయ జెండా అని వివరణ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. 2026, సెప్టెంబర్ 16న తుది తీర్పు వెల్లడించనుంది.