షావుకారు జానకి మృతిపై ప్రముఖుల సంతాపం.. ఓ సినీ యుగం ముగిసిందంటూ భావోద్వేగ నివాళులు!

షావుకారు జానకి మృతిపై ప్రముఖుల సంతాపం.. ఓ సినీ యుగం ముగిసిందంటూ భావోద్వేగ నివాళులు!

దిగ్గజ నటి, పద్మశ్రీ షావుకారు జానకి ( 94 ) మృతి  దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 21న మధ్యాహ్నం 1.59 గంటలకు తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఆమెకు చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆమె మృతిని నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు.

ఏడు దశాబ్దాలకు పైగా..

ఏడు దశాబ్దాలకు పైగా సాగిన షావుకారు జానకి సినీ ప్రస్థానంలో దాదాపు 400 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి నాలుగు తరాల ప్రేక్షకులకు చేరువయ్యారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. అంతకుముందు కళైమామణి, నంది తదితర పురస్కారాలతోనూ ఆమె ప్రతిభకు గుర్తింపు లభించింది.

జానకి చివరిగా.. 

జానకి చివరిగా ( 2023 )  'అన్నీ మంచి శకునములే' చిత్రంలో నటించారు. నందినీ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.  తన అద్భుత అభినయంతో తరతరాల ప్రేక్షకులను అలరించిన జానకి గారు ఇకలేరనే వార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. 

సీఎం రేవంత్ రెడ్డి 

షావుకారు జానకి (94)మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ సంతాపం తెలిపారు. చిన్నతనంలోనే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన షావుకారు జానకి.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 'షావుకారు'చిత్రంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి 'షావుకారు జానకి'గా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించడంతో పాటు హిందీ, మలయాళ సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారని పేర్కొన్నారు. ఆమె పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆమె మరణంతో సినీ పరిశ్రమలో ఏర్పడిన శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షావుకారు జానకి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న షావుకారు జానకి భౌతికంగా దూరమైనప్పటికీ.. ఆమె పోషించిన పాత్రల ద్వారా ఎప్పటికీ మన హృదయాల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 

మాజీ సీఎం వైఎస్ జగన్..

నటి షావుకారు జానకి మృతిపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఏడు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ ,మలయాళం భాషల్లో 400 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాలను చెరగని ముద్రవేశారు. ఎన్టీఆర్, ఏన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజాల సరసన నటించారు. ఎన్నో విభిన్న పాత్రల్లోనూ తన నటనతో మెప్పించారని గుర్తుచేశారు. షావుకారు జానకి మరణం తెలుగుచిత్రసీమకు తీరని లోటుు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు జగన్.

 

చిరంజీవి..

ప్రముఖ నటి, పద్మశ్రీ జానకి గారి మరణవార్త తీవ్ర దుఃఖాన్ని కలిగించిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. 'షావుకారు' చిత్రంతో ప్రారంభమైన ఆమె విశిష్ట సినీ ప్రస్థానం, తెలుగు, తమిళం , అనేక ఇతర భాషలలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది. తన సహజ నటనతో విభిన్నమైన పాత్రలకు జీవం పోసి ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలు మరువలేనివి. జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

 

బాలకృష్ణ..

షావుకారు జానకి తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు హీరో బాలకృష్ణ. ఆమెతో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా నటించిన 'షావుకారు' సినిమాతోనే ఆమెకు 'షావుకారు జానకి' అనే పేరు వచ్చింది. నాన్నగారితో కలిసి ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 'పాండురంగ మహాత్మ్యం' నుంచి ఎన్టీఆర్ బ్యానర్ లోగోలో ఆమె ఫొటోను పెట్టాం. మన దేశంలోనే సుదీర్ఘ నట ప్రస్థానం కలిగిన కళాకారుల్లో షావుకారు జానకి ప్రత్యేకమైన వారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు అని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
 

పవన్ కల్యాణ్..

షావుకారు జానకి కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకి. దాదాపు 400 సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.
 

 

జూనియర్ ఎన్టీఆర్..

జానకి మృతిపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు 'తెలుగు, భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారు పరమపదించారనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.. ఆమె సినీ ప్రయాణం, పోషించిన పాత్రలు మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

►ALSO READ | Sowcar Janaki: నలుగురు సీఎంలతో స్క్రీన్ షేర్.. పద్మశ్రీ షావుకారు జానకి సినీ ప్రస్థానానికి ముగింపు

తమిళనాడు సీఎం విజయ్...

'విలక్షణమైన నటనతో తరతరాల ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న షావుకారు జానకి గారి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 70 ఏళ్లకు పైగా ఆమె అందించిన సేవలు అమూల్యం. ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబానికి నా సానుభూతి' అని పేర్కొన్నారు. 

 

కమల్ హాసన్..

'నన్ను చూస్తే ఆకలి తీరుతుంది అన్నట్టు ఉండే రోజులనుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మేమిద్దరం కలసి అనేక చిత్రాల్లో నటించాం. ఆమె నా తల్లిలాంటిది. నా గురువు కె. బాలచందర్ గారికి ఆమె ఎంతో ఇష్టమైన నటి. దక్షిణ భారత సినిమాలో భర్తీ చేయలేని గొప్ప నటి వెళ్లిపోయారు. ఒక మాతృమూర్తిని కోల్పోయిన అనుభూతి కలుగుతోంది. కంటినీటితో ఆమెకు వీడ్కోలు పలుకుతున్నాను' అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

మంచు విష్ణు..

నటుడు విష్ణు మంచు కూడా జానకి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'షావుకారు జానకి గారి మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె హుందాతనం, గౌరవం,  అద్భుతమైన సినీ ప్రయాణం రాబోయే తరాలకు ఆదర్శం. నేటి యువత ఆమె ఎంతటి దిగ్గజమో తెలుసుకోవాలని సూచిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

రాధిక..

అమ్మ జానకి మరణవార్త విని చాలా బాధపడ్డానని ఎమోషనల్ అయ్యారు నటి రాధిక. ఆమె బలమైన భావాలు, వ్యక్తిత్వం కలిగిన మనిషి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మా నాన్నకు ఆమె మంచి స్నేహితురాలు. ఆమెతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె ఒక లెజెండ్ అని రాధిక భావోద్వేగానికి గురయ్యారు.

 

నటి కస్తూరి..

జానకి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానంటూ నటి కస్తూరి కూడాసోషల్ మీడియాలో స్పందించారు.  95 ఏళ్ల వయసులోనూ ఆమె ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. కొద్దిరోజుల క్రితమే ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడాను, కోలుకుంటారని భావించాను' అని సంతాపం తెలిపారు.

 

వీరితో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు కూడా జానకి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె మరణంతో దక్షిణాది సినిమా ఒక మహోన్నత నటనా ప్రతిభను కోల్పోయిందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ  కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు..