బెంగళూరులో రూ.90లక్షలు శాలరీ.. యూరప్‍లో కోటీ 70 లక్షలు ఆఫర్.. జాబ్ డైలమాలో 28 ఏళ్ల టెక్కీ!

బెంగళూరులో రూ.90లక్షలు శాలరీ.. యూరప్‍లో కోటీ 70 లక్షలు ఆఫర్.. జాబ్ డైలమాలో 28 ఏళ్ల టెక్కీ!

బెంగళూరులో రూ. 90 లక్షలా లేక డబ్లిన్‌లో లక్షా 50వేల యూరోలా? కాగితం మీద చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా అనిపించవచ్చు. కానీ ఇప్పటికే మన దేశంలో అద్భుతమైన పే ప్యాకేజీ, సౌకర్యవంతమైన లైఫ్ స్టైల్, కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లాలనే నిర్ణయం టెక్కీలకు ఒక పెద్ద సవాలుగా మారిందంటూ డైలమాలో ఉన్న ఒక యువ టెక్కీ సోషల్ మీడియాలో ప్రజల నుంచి సలహాలు కోరటం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఒక ఏఐ స్టార్టప్‌లో ఉన్న 28 ఏళ్ల యువ టెక్కీ ఎదుర్కొంటున్న డైలమా ఇదే. ఆయన భార్య బిజినెస్ అనలిస్ట్. వారికి పిల్లలు లేకపోవడంతో విదేశాలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఆయనకు రూ.90 లక్షల ఫిక్సెడ్ వేతనంతో పాటు దాదాపు రూ.75 లక్షల విలువైన ESOPs అందుతున్నాయి. భారత్‌లో ఈ స్థాయి జీవన సౌకర్యం ఉన్నప్పుడు.. యూరప్‌కు వెళ్లి కొత్త అనుభవాలను చవిచూడటం ఆ త్యాగానికి విలువైనదేనా అనే డైలమాలో పడ్డాడు టెక్కీ.

ఇదే సమయంలో డబ్లిన్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. వార్షిక జీతభత్యాల కింద లక్షా 50వేల యూరోలు అంటే సుమారు రూ. కోటి 67 లక్షలు, 50వేల యూఎస్ డాల్టర్లు అంటే దాదాపు రూ.48 లక్షలు విలువైన ఆర్‌ఎస్‌యూలు ఇవ్వడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. అంతేకాకుండా భార్యాభర్తలకు వీసా, రిలోకేషన్ ఖర్చులను కూడా భరిస్తామని తెలిపింది. ఆకర్షణీయమైన ఈ అంకెలను చూస్తే ఎవరికైనా ఆఫర్ నూటికి నూటు శాతం ఆకర్షణీయంగా అనిపిస్తుంది.

►ALSO READ | చక్కెర ధరల భగభగ: మోడీ సర్కార్ E20 విధానమే కారణమంటూ జైరామ్ రమేష్, కేజ్రీవాల్ ఫైర్

అయితే ఐర్లాండ్‌లో విధించే భారీ పన్నులు, ఇక్కడ ఉండే అద్దెలు, జీవన వ్యయాలను బేరీజు వేసుకుంటే భారతదేశంలో లభించే సౌకర్యవంతమైన జీవన శైలే మెరుగని ఆ టెక్కీ భావిస్తున్నాడు. మరోవైపు ఏడేళ్లుగా విదేశాల్లో నివసించాలని, భార్యతో కలిసి ఐరోపా దేశాలన్నిటిని చుట్టేయాలనే తన చిరకాల కోరికను ఈ అవకాశం నెరవేరుస్తుందని ఆలోచనలో ఉన్నాడు. 

డబ్లిన్ ఆఫర్‌ను స్వీకరించాలా లేక భారత్‌లోనే ఉండిపోవాలా అనే ఈ అయోమయంపై ఆయన రెడిట్ వేదికగా సలహా కోరారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. డబ్బు కోసమే అయితే యూరప్‌కు వెళ్లవద్దని.. కేవలం లైఫ్ స్టైల్ అనుభవం కోసమే వెళ్లాలని కొందరు సూచించారు. డబ్లిన్‌లో 150k యూరోలు చాలా మంచి జీతమని.. అయితే భారత్‌లో లభించే 10 నిమిషాల డెలివరీలు, ఇళ్లలో పనులకు మనుషులు దొరకడం వంటి సౌకర్యాలు అక్కడ ఉండవని మరో యూజర్ గుర్తుచేశారు. ఏదిఏమైనా కెరీర్ ప్రాధాన్యతలు, కొత్త సంస్కృతికి అలవాటు పడే సామర్థ్యాన్ని బట్టి ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.