హైదరాబాద్ యదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐటీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 22న ఉదయం ఈ ఘటన జరిగింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సహస్ర చటోపాధ్యాయ, అభిరుఫ్, అబ్బాస్ లు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 4:30 గంటల ప్రాంతంలో వీరు ఖాజాగుడా నుంచి గచ్చిబౌలి వైపు బైక్‌పై వస్తున్న సమయంలో.. స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి వారి బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అబ్బాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మరో బాధితుడు అభిరుఫ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో యువతి సహస్ర చటోపాధ్యాయ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పినప్పటికీ, తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
