విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రత విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు మూడు నెలల గడువు విధించినట్లు సమాచారం.
ఒకప్పుడు ప్లాంట్‌లో సుమారు 1,500 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించగా, గత కొంతకాలంగా దశలవారీగా బలగాల ఉపసంహరణ కొనసాగింది. ప్రస్తుతం ప్లాంట్‌లో సుమారు 350 మంది భద్రతా సిబ్బంది, 120 మంది అగ్నిమాపక సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. తాజా ఆదేశాలతో నవంబర్ 17 నాటికి వీరంతా పూర్తిగా వైదొలగాల్సి ఉంటుంది.
కీలకమైన ప్రభుత్వరంగ పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం ప్లాంట్ భద్రతపై తీవ్ర నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై కార్మిక సంఘాలు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరి దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
