- కొత్త ఇంటికి నంబర్కోసం రూ.20వేల డిమాండ్
- రూ.13వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
జన్నారం రూరల్, వెలుగు: ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు కొత్త ఇంటికి నంబర్ కేటాయించేందుకు లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులకు శుక్రవారం పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామంలో జె.వరలక్ష్మి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో పర్మిషన్, ఇంటి నంబర్కేటాయించేందుకు గ్రామ కార్యదర్శిని సంప్రదించడంతో రూ.20వేలు డిమాండ్ చేసింది. అంత ఇచ్చుకోలేని బాధితురాలు చెప్పడంతో రూ.13వేలకు ఒప్పందం కుదిరింది.
నగదు రూపంలో కాకుండా ఫోన్‌పే ద్వారా తాను సూచించిన మరో సెక్రటరీ లావణ్యకు పంపించాలని వరలక్ష్మి సూచించింది. ఈక్రమంలో బాధితురాలు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మి లంచం డిమాండ్ చేయడం, అనంతరం ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేయాలని ఆదేశించడం వంటి విషయాలకు సంబంధించిన సాక్ష్యాలు శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లకు దొరకడంతో ఆమెను పట్టుకున్నారు.
