రాష్ట్రంలో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ టవర్స్.. త్వరలో నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్

రాష్ట్రంలో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ టవర్స్.. త్వరలో నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్

రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఓట్లు అడగమని, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక కొత్త టెక్నాలజీతో 'ఇందిరమ్మ మోడల్ టవర్స్'ను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయగా, ఇప్పటికే 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.

గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలకు తావులేకుండా, ఈసారి అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే నిజామాబాద్‌లోనూ దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొహంలో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.