రోజూ వాకింగ్ చేస్తున్నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా..? పది నిముషాలు ఇలా చేస్తే..!

రోజూ వాకింగ్ చేస్తున్నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా..? పది నిముషాలు ఇలా చేస్తే..!

షుగర్ వ్యాధి ఈరోజుల్లో కామన్ అయిపోయింది. దాదాపు ప్రతి ఇంట్లో ఓ షుగర్ పేషెంట్ ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వయసు సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరిలో కనిపిస్తోంది షుగర్ వ్యాధి. షుగర్ కంట్రోల్ అవ్వాలంటే డైట్, ట్రీట్మెంట్ తో పాటు అందరు తప్పకుండా చేసేది వాకింగ్. అయితే.. ప్రతి రోజూ వాకింగ్ చేస్తున్నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇలాంటివారు కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా ఫిట్ నెస్, మజిల్ గ్రోత్ మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు డాక్టర్లు.

రక్తంలో గ్లూకోజ్ ను తొలగించడంలో స్కెలిటల్ మజిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు డాక్టర్స్. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటాక మజిల్ సైజ్  క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బాడీలో గ్లూకోజ్ రేగులేట్ చేసే పవర్ పై ప్రభావం పడుతుంది. అందుకే, క్రమం తప్పకుండా నడకతో పాటు, బలాన్ని పెంచే ఒక చిన్న వ్యాయామం చేస్తే మంచిదని అంటున్నారు డాక్టర్స్.

టైప్ 2 డయాబెటిస్ విషయంలో తరచుగా ఫుడ్, కార్డియోపై దృష్టి పెడతారు. కానీ, శరీరంలో గ్లూకోజ్‌ను అత్యధికంగా గ్రహించేది అస్థి కండరాలేనని.. కండరాల బలంపై కూడా దృష్టి పెట్టాలని అంటున్నారు డాక్టర్స్. కండరాలు ఆరోగ్యంగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ ని బయటికి పంపడంలో సాయపడతాయి. అయితే, వయసు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం సహజంగా తగ్గుతుంది...రోజంతా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అది మరింతగా క్షీణించవచ్చు. కాలక్రమేణా, ఇది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో సమస్యలకు మరియు టైప్ 2 డయాబెటిస్ కి దారితీయవచ్చు.

అందుకే షుగర్ కంట్రోల్ అవ్వాలంటే వాకింగ్ మాత్రమే ఏకైక పరిష్కారం కాకపోవచ్చు. నడక ఉపయోగకరమే, కానీ కండరాలు వాటి బలాన్ని, పనితీరును కాపాడుకోవడానికి వ్యాయాయం అవసరమని అంటున్నారు డాక్టర్స్.

రెసిస్టెన్స్ ట్రైనింగ్:

రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే.. కండరాలు ఏదో ఒక బరువును తట్టుకునేలా చేయడం. ఇందులో ఏదైనా వస్తువులు ఎత్తడం, పట్టుకోవడం లాంటి వ్యాయామాలు ఉంటాయి. ఈ విధంగా కండరాలకు శిక్షణ ఇచ్చినప్పుడు, అవి కేవలం బలంగా మారడమే కాకుండా, గ్లూకోజ్, ఇన్సులిన్‌కు మరింత చురుకుగా స్పందించగలవని, దీని ప్రభావం ఒకే సెషన్ తర్వాత ఒక పూర్తి రోజు పాటు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్స్.

►ALSO READ | పిల్లల కోసం:ఆదివారం(ఆగస్టు23)సంతాన సౌభాగ్యం..పుత్రదా ఏకాదశి వ్రతం.. ఏదేవుడిని పూజించాలి.. ఎలా చేయాలి...

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులపై జరిపిన ప్రయోగాలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఈ డేటా ప్రకారం, కేవలం రెసిస్టెన్స్ ట్రైనింగ్ మాత్రమే దాదాపు మూడు నెలల పాటు చేస్తే... HbA1cని గణనీయంగా తగ్గించగలదని తేలింది.


చైర్ స్టాండ్స్:

కుర్చీలోంచి లేచి నెమ్మదిగా తిరిగి కూర్చోండి. మీ తొడలు పనిచేస్తున్నట్లు మీకు సహకరించినంతసేపు ఇది కంటిన్యూ చేయండి.

ప్లాంక్స్:

ప్లాంక్ అంటే శరీరాన్ని కదల్చకుండా, స్థిరంగా ఉంచడం. మీకు సౌకర్యవంతంగా ఉన్నంత సేపు ఈ వ్యాయామం చేయండి.

జిమ్ అవసరం లేని.. ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ఈ వ్యాయామాలు 10 నిమిషాల దినచర్యలో భాగం చేసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందని అంటున్నారు డాక్టర్స్.

10 నిమిషాలు వ్యాయామం సరిపోతుందా?

కేవలం 10 నిముషాలు వ్యాయామం చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందని అనుకోవద్దు. ఇది పూర్తి పరిష్కారం కాదు. వాకింగ్, డైట్ ఎలాగో... ఇది కూడా ఒక అలవాటులా చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రోజూ వాకింగ్ చేసేవారు దానికి తోడు పది నిముషాలు వ్యాయామం చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందని అంటున్నారు డాక్టర్స్.