పంజాగుట్ట, వెలుగు : చెత్త సేకరణను ప్రైవేటు వారికి ఇవ్వడం కరెక్ట్కాదని, జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్ అన్నారు. సోమవారం స్వచ్ఛ ఆటో టిప్పర్లు, చెత్త రిక్షా కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చెత్త సేకరించే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
కార్మికులకు ప్రమాద భీమా, ఆటోలు కొనేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సిటీలో చెత్త సేకరణపై ఏ రాజకీయ పార్టీకి సరైన అవగాహన లేదని, చెత్త సేకరణకు మరిన్ని నూతన విధానాలు అవసరమన్నారు. వ్యాపార దృష్టితో సేకరణ విధానాన్ని రాంకీ వంటి సంస్థలకు అప్పగించడం సబబుకాదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, పీవోబ్ల్యు సంధ్య, సంఘ సేవకురాలు సజయ, జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధక్షుడు పిట్ల శ్రీధర్, వర్గీస్ టీకేనాథ్ పాల్గొన్నారు.
