కీసరలో గుప్త నిధుల కోసం తవ్వకాలు..మఠం ప్రాంతంలో క్షుద్రపూజల ఆనవాళ్లు.. 

 కీసరలో గుప్త నిధుల కోసం తవ్వకాలు..మఠం ప్రాంతంలో క్షుద్రపూజల ఆనవాళ్లు.. 
  • పురాతన రాళ్లను పెకిలించిన దుండగులు పాత రాతి కట్టడాల 
  • లోపలి మట్టి తొలగింపు   

కీసర, వెలుగు : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట పరిసరాల్లో ఉన్న పురాతన సన్యాసి మఠం వద్ద గుప్త నిధుల కోసం ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. గుట్టపై ఉన్న పురాతన రాతి నిర్మాణాలు, లింగాలకుంట పరిసర ప్రాంతాల్లో కొందరు గుప్తనిధుల కోసం వెతికారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు లభించాయి.

మఠం, ఆలయ వెనుక భాగంలో ఉన్న పాత రాతి కట్టడాల లోపలి భాగంలో కొన్ని అడుగుల మేర మట్టిని తొలగించి, పురాతన రాళ్లను పెకిలించి తవ్వకాలు జరిపారు. సోమవారం తెల్లవారుజామున స్థానికులు, ఆలయ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా... అక్కడ కొబ్బరికాయలు, నిమ్మకాయల ఆనవాళ్లతో పాటు పురాతన కట్టడాల నుంచి మట్టిని తొలగించి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

1970లోనే పురావస్తు తవ్వకాలు 

పురావస్తు శాఖ అధికారులు 1970, 1980 దశకాల్లోనే చారిత్రక ఆధారాల కోసం మొదటిసారిగా ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ టైంలోనే ఎన్నో పురాతన అవశేషాలు బయటపడ్డాయి. 'తోళుచువన్రు' లేదా 'తుళుచువన్రు' అని చదివే ఒక ప్రాచీన తెలుగు శాసనం, శైలి ఆధారంగా క్రీ.శ. 4వ, 5వ శతాబ్దానికి చెందినవని నిర్ధారించిన పన్నెండు పంచలోహ జైన తీర్థంకర కంచు విగ్రహాలు , విష్ణుకుండినుల కాలం నాటి కోట గోడలు, ఇటుక నిర్మాణాలు, బౌద్ధ, జైన మతానికి చెందిన ఇటుక నిర్మాణాలు, రాతితో చెక్కిన నీటి తొట్టెలు లభించాయి. దీంతో అప్పటి నుంచి అప్పుడప్పుడు గుప్త నిధులు ఉండవచ్చరు భ్రమతో చాలామంది దుండగులు ఆలయ చుట్టుపక్కల తవ్వకాలు జరుపుతున్నారు.   

కీసరనే ఎందుకు?

కీసరగుట్టపై అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. దీన్ని స్వయంభూ లింగ క్షేత్రం అని పిలుస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయ నిర్మాణాలను వేర్వేరు కాలాల్లో వివిధ రాజవంశాలకు చెందిన రాజులు చేశారు. 4, 5 శతాబ్దాల్లో ఈ ప్రాంతం విష్ణుకుండినుల రాజధానిగా  ఉండేది. వీరి కాలంలోనే ఇటుక కట్టడాలు, రాతి నిర్మాణాలు జరిపారు. అలాగే, చాళుక్యుల కాలంలోనే కొన్ని నిర్మాణాలు జరిపారని అంటారు. గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్న పునరుద్ధరణ పనులు చేయించారు. పురాతన జైన, బౌద్ధ అవశేషాలు ఉన్న ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది.