రైతుల చెంతకే అగ్రి వర్సిటీ సైంటిస్టులు..తెలంగాణ లోని 12 కేంద్రాల్లో అమలుకు కసరత్తు

రైతుల చెంతకే అగ్రి వర్సిటీ సైంటిస్టులు..తెలంగాణ లోని 12 కేంద్రాల్లో అమలుకు కసరత్తు
  • ‘ఇన్నోవేషన్  టు ఇంపాక్ట్’  పేరుతో స్పెషల్​ ప్రోగ్రాం
  •     పంటల మార్పిడి, దిగుబడి పెంపే లక్ష్యం
  •     ప్రతి గ్రామం నుంచి 20 నుంచి25 మంది రైతుల ఎంపిక 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతులకు లేటెస్ట్  టెక్నాలజీని చేరువ చేసేందుకు అగ్రికల్చర్  వర్సిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైంటిస్టులను రీసెర్చ్  సెంటర్లకే పరిమితం చేయకుండా రైతుల పొలాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ఇన్నోవేషన్  టు ఇంపాక్ట్’ పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అమలు చేయనున్నారు. రెండేండ్ల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో పంటల మార్పిడి, ఆధునిక సాంకేతికతల వినియోగం, దిగుబడి అంతరాల తగ్గింపు, రైతుల ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

గ్రామానికి 20 నుంచి25 మంది రైతులు..

వర్సిటీ ఆధ్వర్యంలో పాలెం, తాండూరు, మధిర, వరంగల్, కంపాసాగర్, రుద్రూరు, ఆదిలాబాద్, జగిత్యాల, తోర్నాల, కరీంనగర్, బసంత్‌‌‌‌‌‌‌‌పూర్, కూనారంలో ‘ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్’ ను అమలు చేయనున్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. ఒకే పంటపై ఆధారపడకుండా, రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా మార్పు తీసుకురావాలని వర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రతి కేంద్రం పరిధిలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి, ఒక్కో గ్రామం నుంచి 20 నుంచి25 మంది రైతులను ఎంపిక చేస్తారు.

రైతు పొలంలోనే టెక్నాలజీ ఫలితాలు..

రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు రైతుల పొలాల్లోనే ఆధునిక సాగు పద్ధతులను అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి కేంద్రంలో నలుగురు సైంటిస్టులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు పంటల సాగు ప్రారంభం నుంచి కోత వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తాయి. సీజన్‌‌‌‌‌‌‌‌  ముగిసిన తర్వాత దిగుబడి, సాగు ఖర్చు, ఆదాయం తదితర అంశాలను విశ్లేషించి.. సాంకేతికతతో వచ్చిన మార్పును రైతులకు ప్రత్యక్షంగా వివరిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు రూ.25 కోట్ల నిధులు అవసరమవుతాయని వర్సిటీ అంచనా వేసింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నెల18 నుంచి 31 వరకు 12 కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.