- కొత్త మందుల ఫార్ములాల అభివృద్ధికి అవకాశం
- వర్సిటీ నుంచే పేటెంట్లు, స్టార్టప్ లు వస్తయ్
- రూసా నిధులతో ప్రారంభించిన వీసీ కుమార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: అడ్వాన్స్ రీసెర్చ్, టెక్నాలజీ ఆధారిత చదువును ప్రోత్సహించే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ కీలక ముందడుగు వేసింది. రూ.1.75 కోట్ల రూసా-2.0 నిధులతో ఏర్పాటు చేసిన అడ్వాన్సుడ్ సింథసిస్ రీసెర్చ్ లాబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ సెల్ కల్చర్ లాబొరేటరీ, ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను సోమవారం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్కుమార్ మొలుగరం ప్రారంభించారు. ఈ మూడు కేంద్రాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి.
అసలేంటీ ల్యాబ్‌లు..
అడ్వాన్స్‌డ్ సింథసిస్ రీసెర్చ్ లాబొరేటరీ (ఏఎస్‌ఆర్‌ఎల్) అనేది కెమిస్ట్రీ, ఫార్మా రంగానికి సంబంధించిన సరికొత్త మాలిక్యూల్స్ (అణువులు), ఔషధ సమ్మేళనాలు (డ్రగ్ కాంపౌండ్స్ ), అడ్వాన్స్ మెటిరీయల్స్ (పదార్థాల) సృష్టికి ఉపయోగపడే ఒక అత్యాధునిక పరిశోధనా కేంద్రం.
సైంటిస్టులు కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, అధునాతన ల్యాబ్ పరికరాల సాయంతో సరికొత్త మందుల ఫార్ములాలను ఇక్కడ కృత్రిమంగా అనుసంధానం (సింథసిస్) చేస్తారు. ఓయూ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇలాంటి ల్యాబ్‌లను ప్రవేశపెట్టడం వల్ల స్టూడెంట్స్ , రీసెర్చ్ స్కాలర్లకు ప్రపంచ స్థాయి రీసెర్చ్ పరికరాలపై ప్రయోగాలు చేసే ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్టూడెంట్లను తీర్చిదిద్దడానికి, యూనివర్సిటీ నుంచే నేరుగా పేటెంట్లు, స్టార్టప్‌లు పుట్టుకురావడానికి ఎంతగానో దోహదపడుతుంది.
అలాగే, మాలిక్యులర్ బయాలజీ అండ్ సెల్ కల్చర్ లాబొరేటరీ అనేది డీఎన్ఏ/ఆర్‌ఎన్ఏ జన్యు మార్పులను అధ్యయనం చేయడానికి, మనుషులు లేదా జంతువుల కణాలను కృత్రిమంగా పెంచి పరిశోధించడానికి ఉపయోగపడే ఒక అత్యాధునిక పరిశోధనా కేంద్రం. ఇక్కడ సైంటిస్టులు రోగాల వ్యాప్తిని, కొత్త మందుల ప్రభావాన్ని జీవమున్న కణాలపై నేరుగా పరీక్షిస్తారు. ఇది క్యాన్సర్, ఇతర వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలను స్పీడప్చేయడమే కాకుండా, స్టూడెంట్స్ గ్లోబల్ బయోటెక్ ఫార్మా రంగంలో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఇక ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్లో హై-ఎండ్ కంప్యూటేషనల్ రిసోర్సెస్, అధునాతన సాఫ్ట్‌వేర్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టూడెంట్స్థియరీకే పరిమితం కాకుండా సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ డిజైన్, మాలిక్యులర్ సైన్సెస్ వంటి వివిధ రంగాల్లో ఏఐ టూల్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి అడ్వాన్సుడ్సైంటిఫిక్రీసెర్చ్చేయడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుంది.
హైదరాబాద్‌లో అక్కడే...
హైదరాబాద్‌లో అత్యాధునిక సింథసిస్, రీసెర్చ్ల్యాబొరేటరీలు తార్నాకలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో, బాలానగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఫార్మా రంగంలో ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లోని ‘న్యూఆటమ్ లాబ్స్ రీసెర్చ్ సెంటర్’, నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని ‘అరాజెన్ లైఫ్ సైన్సెస్’, ‘ దేవ్ సింథసిస్ ఇండియా’, ‘ హైమా (అవ్రా) సింథసిస్’ లాంటి పరిశోధనా కేంద్రాల్లో మాత్రమే ఉన్నాయి.
మాలిక్యులర్ బయాలజీ అండ్ సెల్ కల్చర్ లాబొరేటరీలు తార్నాకలోని సీఎస్‌ఆర్ సీసీఎంబీ, అత్తాపూర్‌లోని లాకోనెస్ , హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోని అస్పైర్ బయో నెస్ట్ , నాచారంలోని ‘ ఆంప్లికాన్ బయోసిస్టమ్స్’, ‘మన్నా బయోటెక్’, కూకట్‌పల్లిలోని ‘సియెన్సియా లైఫ్ సైన్సెస్’ లాంటి ప్రైవేట్ సంస్థల్లో మాత్రమే ఉన్నాయి.
