అదృశ్యమైన వ్యాపారి హత్య.. మేడ్చల్ చెరువు వద్ద డెడ్ బాడీ లభ్యం

అదృశ్యమైన వ్యాపారి హత్య.. మేడ్చల్ చెరువు వద్ద డెడ్ బాడీ లభ్యం
  • రూ.10లక్షలతో ఇంటి నుంచి వెళ్లి మిస్సింగ్

కుత్బుల్లాపూర్, వెలుగు: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.10 లక్షలతో ఇంటి నుంచి వెళ్లిన రాజస్తాన్‌కు చెందిన వ్యాపారి నేమారాం చౌదరి (61) హత్యకు గురయ్యాడు. మేడ్చల్ చెరువు వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గుండ్లపోచంపల్లిలో నివసించే నేమారాం.. చిట్టీలు, లైటింగ్ వ్యాపారం చేస్తుంటారు. ఈ నెల 2న బోయిన్​పల్లిలోని కొడుకు వద్దకు వెళ్లి, అక్కడి నుంచి రూ.10 లక్షలు తీసుకుని బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు.

3న కుమారుడు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. 4న మేడ్చల్ మురహరిపల్లి చెరువు వద్ద డెడ్ బాడీని గుర్తించి హత్య కేసుగా మార్చారు. అల్వాల్ బ్రిడ్జ్ వద్ద బాధితుడి ఫోన్ లాస్ట్ లొకేషన్ చూపినట్లు తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మార్వాడీ సంఘం ప్రతినిధులు పేట్ బషీరాబాద్ పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందని ఆరోపించారు. అడిషనల్ డీసీపీ పురుషోత్తం రెడ్డి, ఏసీపీ శంకర్ రెడ్డి స్పందించి.. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.