- మెదడుపై పరిశోధనకు మెడిసిన్ నోబెల్
- డిస్సెరోత్, హెగెమన్, నాగెల్‌కు పురస్కారం
- ఆప్టోజెనెటిక్స్ రంగంలో రీసెర్చ్‌కు వరించిన బహుమతి
- కాంతితో నాడీ కణాలను కంట్రోల్ చేసే పద్ధతి
- మెదడుపై పరిశోధనలలో సరికొత్త విప్లవం
- నాడీ సంబంధ వ్యాధుల అంశంలో కీలకం '
స్టాక్‌హోమ్: మెదడులోని కణాల పనితీరుకు సంబంధించి కీలక ఆవిష్కరణ చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వరించింది. నాడీ కణాలను కాంతి ద్వారా ఆన్/ ఆఫ్ చేసి, వాటి పనితీరును నియంత్రించే వ్యవస్థను వారు అభివృద్ధి చేశారు. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త కార్ల్ డిస్సెరొత్, జర్మనీలోని హంబోల్డ్ యూనివర్సిటీకి చెందిన పీటర్ హెగ్ మాన్, యూనివర్సిటీ ఆఫ్ ఉర్జ్ బర్గ్ కు చెందిన జార్జి నగెల్ లను ఈ ఏడాది వైద్య నోబెల్ కు ఎంపిక చేసినట్లు స్వీడన్ లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈ ముగ్గురు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘ఆప్టోజెనిక్స్’ ద్వారా మెదడులోని కణాలను, వాటి పనితీరును అర్థం చేసుకోవడం సులభంగా మారిందని తెలిపింది. పార్కిన్సన్ సహా నాడీ వ్యవస్థకు సంబంధించిన పలు వ్యాధుల చికిత్సలో ఈ ఆవిష్కరణ కీలకంగా మారిందని వివరించింది.
మెదడులోని రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం ఈ పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనశాలల్లో ఉపయోగిస్తున్నారని కమిటీ కొనియాడింది. కాగా, నోబెల్ ప్రైజ్ లో భాగంగా విజేతలు ముగ్గురూ 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.12 కోట్లు) అందుకుంటారు. గతేడాది, వైద్య నోబెల్ ప్రైజ్.. రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై జరిపిన పరిశోధకులు ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. కాగా, సోమవారం వైద్య నోబెల్ తో పురస్కారాల ప్రకటన మొదలైంది.
ఏమిటీ ఆవిష్కరణ..
న్యూరోసైన్స్ లో ‘ఆప్టోజెనెటిక్స్’ ఆవిష్కరణ సరికొత్త విప్లవానికి కారణమైందని నోబెల్ కమిటీ తెలిపింది. జర్మనీ శాస్త్రవేత్త పీటర్ హెగ్ మాన్ తన పరిశోధనలో భాగంగా ఆకుపచ్చని పాచి (గ్రీన్ అలగె) లో ఓ ప్రత్యేకతను గుర్తించారు. ఏక కణ జీవి ఫ్యామిలీకి చెందిన ఈ పాచి.. వెలుతురు వైపు ఈదడం హెగ్ మాన్ గమనించారు. మరో శాస్త్రవేత్త జార్జి నగెల్ తో కలిసి గ్రీన్ అలగె లోని ఈ ప్రత్యేకతకు కారణమైన ప్రొటీన్ ఛానల్‌రొడాప్సిన్ ను కనుగొన్నారు. ఈ ప్రొటీన్ పై కాంతి పడినప్పుడు సంబంధిత కణం యాక్టివేట్ కావడం, కాంతి ఆగిపోగానే డియాక్టివేట్ కావడం గుర్తించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వడంతో దీనిని మనుషుల మెదడులోని కణాలలో ప్రవేశపెట్టే దిశగా కార్ల్ డిస్సెరొత్ తో కలిసి పరిశోధనలు కొనసాగించారు. దీని ఫలితమే ఆప్టోజెనెటిక్స్ ఆవిష్కరణ. ఇది మెదడు పనితీరు, నాడీ వ్యవస్థలను బాగా అర్థం చేసుకోవడానికి, నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
