జూబ్లీహిల్స్, వెలుగు : బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక సాధికారత సాధన కోసం భారీ ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. వచ్చే ఏడాది లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అధ్యక్షతన జరిగింది.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలను ఐక్యం చేసేందుకు తెలంగాణలో గ్రామస్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు విదేశాల్లో ఉన్న బీసీలను కూడా సంఘంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. త్వరలో వెబ్సైట్ ప్రారంభించి, ఐదు లక్షల మందికి ఉచిత సభ్యత్వం కల్పించనున్నట్లు చెప్పారు. సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ బీసీ జనాభాకు తగిన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్, సంఘం ఉపాధ్యక్షుడు గురురాజ్ పాల్గొన్నారు.
