సీఈసీపై కాంగ్రెస్ జంగ్ సైరన్.. ఉద్యమ క్యాలెండర్ ప్రకటించిన పార్టీ హైకమాండ్

సీఈసీపై కాంగ్రెస్ జంగ్ సైరన్.. ఉద్యమ క్యాలెండర్ ప్రకటించిన పార్టీ హైకమాండ్
  • ఈ నెల 10 నుంచి నవంబర్ 26 వరకు ‘ఓట్ బచావో- దేశ్ బచావో’
  • ఉద్యమ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
  • అక్టోబర్ 10 నుంచి 25 మధ్య బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిల్లో నిరసనలు
  • 25 నుంచి నవంబర్ 15 వరకు “ఓట్ రక్షక్ అభియాన్”  
  • నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీలా మైదానంలో భారీ ర్యాలీ
  • అదే నెల 8న ఇండియా కూటమి భేటీకి కార్యాచరణ
  • నవంబర్ 25, 26 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం

న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై రాబోయే రెండు నెలల పాటు కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు పలు దశల్లో  ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ప్రచారాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఏఐసీసీ, పీసీసీ, బ్లాక్, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. సోమవారం ఢిల్లీలో పార్టీ హెడ్ ఆఫీసు ఇందిరా భవన్ లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీలు, ఇన్ చార్జ్ లు, పీసీసీ చీఫ్ లతో కీలక సమావేశం జరిగింది. 

ఈ మీటింగ్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇతర కీలక నేతలు హాజరయ్యారు. దాదాపు రెండు  గంటలకు పైగా జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ వాటిని మీడియాకు వివరించారు.

బూత్​స్థాయి నుంచి ఢిల్లీ వరకు 

అక్టోబర్ 10 నుంచి 20 వరకు బ్లాక్ స్థాయిలో “ఓట్ బచావో – దేశ్ బచావో” ప్రచారం చేపట్టనున్నట్లు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు సైకిల్, బైక్ యాత్రలతో జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలను, బీజేపీ ఓట్ చోరీని ప్రచారం చేస్తామన్నారు. అలాగే జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మల దహనం, కరపత్రాల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 15 వరకు “వోట్ రక్షక్ అభియాన్” నిర్వహించనున్నట్లు కే.సీ. వేణుగోపాల్ తెలిపారు. 

రెండో దశలో అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 25 వరకు బూత్ స్థాయిలో “ఓట్ బచావో – దేశ్ బచావో చౌపాల్” నిర్వహణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొంటారని, ప్రధాని మోదీ–అమిత్ షా మోసపూరిత ‘ఓట్ చోరీ’ విధానాలు వివరిస్తారన్నారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌‌‌‌లీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 25, 26 తేదీల్లో “చలో ఢిల్లీ” యాత్రలు చేపడతామన్నారు. 

25న కాంగ్రెస్ ‘ఢిల్లీ ఛలో’ వాహన ర్యాలీ కి పిలుపునిచ్చారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ఆరు యాత్రలు ఉంటాయని తెలిపారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ యాత్రలు ఢిల్లీకి చేరుకుంటాయన్నారు. నవంబర్ 8 న ఇండియా కూటమి సమావేశం ఉంటుందన్నారు. సీఈసీ జ్ఞానేష్‌‌‌‌ను తొలగించి, అరెస్టు చేసి, విచారించే వరకు పోరాటం ఆగదని ప్రకటించారు.

ఓట్ల పరిరక్షణలో తెలంగాణ మోడల్ అనుసరించండి..

ఓట్ల పరిరక్షలో తెలంగాణ అనుసరిస్తోన్న విధానాలను హైకమాండ్ ప్రశంసించింది. దీన్ని అనుసరించాల్సిందిగా ఇతర రాష్ట్రాల పీసీసీలకు సూచించింది. ఏఐసీసీ నిర్వహించిన ఈ కీలక మీటింగ్‌‌‌‌లో మహేశ్ కుమార్ గౌడ్ పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలు, వర్గాల ప్రతినిధులు తమ ఓట్లను తామే దక్కించుకునేలా ప్రోత్సహిస్తోన్న తీరును వివరించారు. అలాగే గజ్వేల్ లేదా సిద్దిపేటలో జరిగే సమావేశానికి పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి అనుమతి కోరారు. ఈ సందర్భంగా ఖర్గేతో పాటు రాహుల్, ఇతర ముఖ్య నేతలు తెలంగాణ అనుసరిస్తోన్న విధానాన్ని అభినందించారు.