రామాయంపేట, వెలుగు: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. సోమవారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన డెంటల్ చైర్ ను ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ లో డాక్టర్లతో సమావేశమయ్యారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంటల్ చైర్ వచ్చి మూడు నెలలు అవుతున్నా, ఇప్పటి వరకు డెంటల్ సేవలు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని సూపరింటెండెంట్ లింబాద్రిని ప్రశ్నించారు.
గైనకాలజిస్ట్ పోస్టు ఖాళీగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేట ఆసుపత్రితో పాటు మెదక్ మెడికల్ కాలేజీలో ఒకే డాక్టర్ కు పోస్టింగ్ ఎలా ఇస్తారని నిలదీశారు. అనంతరం రామాయంపేట శివారులో మొక్కలు నాటే కార్యక్రమానికి మంగళవారం గవర్నర్ రానుండగా, ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. డీసీహెచ్ శివదయాల్, బీజేపీ నాయకులు రాగి రాములు, యాదగిరి, శంకర్ గౌడ్, అవినాశ్ రెడ్డి ఉన్నారు.
