జననాయకుడు కాకా.. కార్మికులు, పేదల కోసం అవిశ్రాంత పోరాటం

జననాయకుడు కాకా.. కార్మికులు, పేదల కోసం అవిశ్రాంత పోరాటం
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర
  • కాకా పోరాటాలను స్మరించుకున్న మంత్రులు, కాంగ్రెస్, కార్మిక​ నేతలు 
  • రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వెంకటస్వామి జయంతి 
  • తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి: జానారెడ్డి
  • తెలంగాణ ఉద్యమంలో కాకా పాత్ర కీలకం: దత్తాత్రేయ
  • కాకా జీవితం కార్మిక సంక్షేమానికి అంకితం: మంత్రి పొన్నం ప్రభాకర్​
  • కాకా ఆశయాలను కొనసాగిస్తం: మంత్రి వివేక్ 
  • గుడిసె వాసుల పక్షాన ఆయన పోరాటం మరువలేనిది: కేకే
  • పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెట్టాలి: జాజుల 
  • కాకా స్ఫూర్తితో సింగరేణి కార్మికులకు 10 వేల పెన్షన్ కోసం పోరాడుతున్నా: ఎంపీ వంశీకృష్ణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కాకా వెంకటస్వామి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. సమాజంలో, రాజకీయాల్లో కాకా లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఆయన 97వ జయంతి సందర్భంగా సోమవారం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహమ్మద్​ అజారుద్దీన్​, కాకా తనయులు మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనువడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండారు దత్తాత్రేయ, ఏఐసీసీ ఎస్సీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత రాజేశ్​ లిలోథియా, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, అంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్మిక నేత, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు తదితరులు పాల్గొని కాకాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా, ఎంపీగా కాకా చేసిన అభివృద్ధి, సంస్కరణలపై షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రదర్శించారు.

సింగరేణి మనుగడలో కాకాది కీలక పాత్ర: మంత్రి వివేక్​

కాకా ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకుడని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. ఉన్నత పదవులు వచ్చినా ప్రజలను, కార్మికులను మర్చిపోలేదని చెప్పారు. సింగరేణిని కాపాడటంలో, ఎన్టీపీసీ నుంచి నిధులు కేటాయించడంలో, కార్మికులకు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదుపాయం కల్పించడంలో కాకా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. కాకా తనను ‘ప్రజల కోసం పనిచేయాలి’ అని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలోనే తాను పనిచేస్తున్నానని మంత్రి వివేక్‌‌ చెప్పారు. విశాఖ చారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

గుడిసెవాసుల కోసం జాతీయ ఉద్యమం: జానారెడ్డి

పేదల నివాస హక్కుల కోసం ‘నేషనల్‌‌ హట్స్‌‌’ అనే సంస్థను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ఉద్యమించిన పోరాటయోధుడు కాకా అని మాజీ మంత్రి జానారెడ్డి కొనియాడారు. కులమతాలకు అతీతంగా సామాజిక సామరస్యానికి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ తొలిదశలో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచారని, ప్రత్యేక తెలంగాణ కోసం చివరివరకు మార్గదర్శనం చేశారని గుర్తు చేశారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయన వారసులకు, అనుచరులకు నిజమైన బాధ్యత అని అన్నారు.

కార్మిక సంక్షేమానికి పెద్దపీట: బండారు దత్తాత్రేయ

సామాన్య దళిత కుటుంబంలో పుట్టి.. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించిన మహనీయుడు కాకా అని మాజీ గవర్నర్‌‌ బండారు దత్తాత్రేయ అన్నారు. 7 సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలో అరుదైన మైలురాళ్లు అధిగమించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు పెన్షన్‌‌ విధానం తీసుకురావడంలో కాకా కృషి చేశారని చెప్పారు.

గుడిసెల పోరాటం మరువలేం: కేకే

కాకా గురించి ఎంత చెప్పినా ఆయన వ్యక్తిత్వంలో సగం కూడా చెప్పినట్టు కాదని ప్రభుత్వ సలహాదారు కే  కేశవరావు అన్నారు. పేదల గుడిసెల కోసం పాలకులను ఎదిరించి పోరాడారని, బషీర్‌‌బాగ్‌‌, నాంపల్లి తదితర ప్రాంతాల్లో పేదలకు భూములు, గుడిసెలు ఇప్పించారని గుర్తు చేశారు. లక్డీకాపూల్‌‌లో మూడు రోజుల నిరాహార దీక్ష చేసి గుడిసెల పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారని తెలిపారు.

కార్మిక సంక్షేమానికి జీవితం అంకితం: పొన్నం

కోట్లాది మంది పుడతారు.. పోతారు.. కానీ భావితరాలకు మార్గదర్శకంగా నిలిచేవారు కొందరేనని, వారిలో కాకా ఒకరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ అన్నారు. కార్మికుడిగా మొదలైన కాకా కార్మిక సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. సింగరేణి, ఎఫ్‌‌సీఐ, ఎన్టీపీసీ కార్మికుల హక్కుల కోసం పోరాడారని, పేద విద్యార్థులకు విద్య అందించేందుకు అంబేద్కర్‌‌ విద్యాసంస్థలను స్థాపించారని గుర్తు చేశారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా..: అజారుద్దీన్​

కాకా లాంటి మహోన్నత వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా జన్మిస్తారని మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్‌‌ అజారుద్దీన్‌‌ అన్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు వినేవారని చెప్పారు. చిన్నతనంలో క్రికెట్‌‌ ఆడుతున్న రోజుల్లో కాకాతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కష్టపడు.. కష్టపడకుండా జీవితంలో ముందుకు వెళ్లలేవు’ అని కాకా ఇచ్చిన స్ఫూర్తే తన ఎదుగుదలకు పునాదిగా మారిందని చెప్పారు. 

నాన్నే మాకు మార్గదర్శి: ఎమ్మెల్యే గడ్డం వినోద్​

తమ కుటుంబం ఈ స్థాయిలో నిలబడటానికి కాకా, ఆయన సహచరులే కారణమని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌ అన్నారు. కాకా అంకితభావం ముందు తామంతా కేవలం రెండు శాతమేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన కన్న కలలను ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్‌‌ గాయాలైనా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. ‘సింపుల్‌‌గా, నిజాయితీగా, వాస్తవికంగా బతకాలి’ అన్న కాకా మాటలను తమ జీవితానికి మార్గదర్శకంగా పేర్కొన్నారు.

గుడిసెల వెంకటస్వామిగా ఖ్యాతి: వెంకట్రావు

హైదరాబాద్‌‌లో నిలువనీడ లేని వేలాది మంది కార్మికులకు నివాస స్థలాలు ఇప్పించి ‘గుడిసెల వెంకటస్వామి’గా కాకా ఖ్యాతి పొందారని కార్మిక నేత, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు చెప్పారు. సింగరేణి సంస్థను మూత పడకుండా కాపాడిన అపర భగీరథుడని కొనియాడారు. రామగుండం కోల్‌‌బెల్ట్‌‌ ప్రాంతానికి కాకా ఎప్పటికీ అసలైన నాయకుడేనని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలిపారు. రామగుండం, బెల్లంపల్లి ప్రాంత ప్రజలకు దాదాపు 50 ఏండ్లపాటు సేవ చేశారని చెప్పారు.

 రామగుండం ఫర్టిలైజర్‌‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో కాకా కలిసి పోరాడారని గుర్తు చేశారు. అట్టడుగు వర్గంలో పుట్టి బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానేత కాకా అని ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ చైర్మన్‌‌, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కొనియాడారు. కాకా తనకు రాజకీయ తండ్రి, జీవిత మార్గదర్శి అని ఏఐసీసీ ఎస్సీ సెల్‌‌ నేత రాజేశ్‌‌ లిలోథియా అన్నారు. 

పాతబస్తీలో మతకల్లోలాల సమయంలో కాకా స్వయంగా వెళ్లి బడుగు, బలహీన వర్గాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారని మాజీ ఎంపీ అంజన్‌‌కుమార్‌‌ యాదవ్‌‌  గుర్తు చేశారు. హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌‌ స్టేడియం ఉండాలన్న కాకా సంకల్పం, ఆయన కొడుకు వివేక్‌‌ను ప్రోత్సహించడం వల్ల రాజీవ్‌‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌‌ స్టేడియం నిర్మాణానికి బాటలు పడ్డాయని  పీసీసీ మేధావుల ఫోరం కన్వీనర్‌‌ అనంతుల శ్యామ్‌‌మోహన్‌‌ గుర్తు చేశారు.

ట్యాంక్‌‌బండ్‌‌ విగ్రహం వద్ద కాకాకు ఘన నివాళి

హైదరాబాద్‌‌లోని ట్యాంక్‌‌బండ్‌‌పై కాకా 97వ  జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కాకా విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, కాకా కుటుంబ సభ్యులు వివేక్ వెంకటస్వామి, గడ్డం సరోజా, ఎమ్మెల్యే వినోద్, మాల మహానాడు నేత చెన్నయ్య,  అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాకా కార్మికలోకం కోసం చేసిన పోరాటాలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీలో కాకా చిత్రపటానికి మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు.

 ‘‘మా తండ్రి శ్రీపాదరావుకు కాకా అత్యంత సన్నిహితుడు. కాకాతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మా ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా ఆయన పనిచేశారు . కార్మికలోకానికి అండగా నిలబడ్డారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన రాబోయే తరాలకు ఉపాధి కల్పించేలా ఎన్నో ప్రణాళికలు రూపొందించారు’ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ యువ నాయకులు కాకా స్ఫూర్తితో ముందుకెళ్లాలని శ్రీధర్‌‌‌‌బాబు పిలుపునిచ్చారు.

బుల్లెట్‌‌ తగిలినా వెనక్కి తగ్గలే: ఎంపీ వంశీకృష్ణ

ప్రత్యేక తెలంగాణ కోసం శరీరానికి బుల్లెట్‌‌ తగిలినా వెనక్కి తగ్గని పోరాటయోధుడు కాకా అని ఆయన మనుమడు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాతే నా ఆఖరి శ్వాస విడుస్తా’ అని పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించేందుకు చివరివరకూ పోరాడారని గుర్తుచేశారు. కాకా చూపిన పోరాట బాటలోనే ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తానన్నారు.

ఆయన స్ఫూర్తితో కార్మికుల పెన్షన్‌‌ను రూ.10 వేలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తూ.. పార్లమెంట్‌‌లో తాను పోరాడుతున్నట్టు తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌)కు సంబంధించిన రూ.10 వేల కోట్ల రుణమాఫీ కోసం కాకా, వివేక్‌‌ అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో పోరాడారని గుర్తు చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందేలా ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ విషయంలోనూ పోరాడతానని వంశీకృష్ణ చెప్పారు.