- హాస్పిటల్ ఎదుట కుటుంబీకుల ఆందోళన
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భస్థ శిశువుతో పాటు మహిళ మృతిచెందడంతో డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన రిచిత(27) నిండు గర్భిణి. ఆదివారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో బెల్లంపల్లి చౌరస్తా సమీపంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. డాక్టర్ గజవాడ ప్రతిభ స్కానింగ్ చేసి గర్భస్థ శిశువు చనిపోయినట్టు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేసి రిచిత ప్రాణాలు కాపాడాలని ఆమె భర్త చందు, కుటుంబసభ్యులు కోరారు.
నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పిన డాక్టర్, అడ్వాన్స్‌గా రూ.20 వేలు చెల్లించినా పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. సాయంత్రం ట్రీట్‌మెంట్ ప్రారంభించారని, రాత్రి 11 గంటలకు రిచిత నోట్లోంచి నురగలు, రక్తం వచ్చాయని తెలిపారు. హడావుడిగా వెంటిలేటర్ ఏర్పాటు చేసి మరో ఆస్పత్రికి రెఫర్ చేశారని చెప్పారు. అక్కడ గంట క్రితమే రిచిత మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలు మృతి చెందారని ఆరోపించారు. సోమవారం ఉదయం వరకు హాస్పిటల్ ఎదుట డెడ్‌బాడీతో ఆందోళన చేపట్టారు.
