లైంగిక దాడి చేయాలంటే నేరగాళ్ల గుండెల్లో దడ పుట్టాలి: సుప్రీం కోర్టు

లైంగిక దాడి చేయాలంటే నేరగాళ్ల గుండెల్లో దడ పుట్టాలి: సుప్రీం కోర్టు
  • ఢిల్లీలో వరుస లైంగిక దాడులపై సుప్రీం ఆగ్రహం
  • మహిళల భద్రతా చర్యలు పేపర్లకే పరిమితం కావద్దు
  • రాత్రి11 గంటలకూ రోడ్లపై, మెట్రోలో భద్రంగా తిరిగే పరిస్థితులు ఉండాలని కామెంట్
  • నేరాలను కట్టడి చేయడమే ముఖ్యమని వెల్లడి

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్ ప్రాంతంలో ఇటీవల వరుసగా జరిగిన లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మహిళలపై నేరాలకు పాల్పడేవారి గుండెల్లో దడ పుట్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మహిళల భద్రతకు సంబంధించిన చర్యలు కాగితాలకే పరిమితం కావద్దని, తాము సురక్షితంగా ఉన్నామని ప్రతి మహిళా భావించేలా చర్యలుండాలని కోర్టు స్పష్టం చేసింది. 

రాత్రి 11 గంటల సమయంలోనూ ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌లో మహిళలు రోడ్లపై, మెట్రోలో స్వేచ్ఛగా, భద్రంగా తిరిగే పరిస్థితులు కల్పించాలని పేర్కొంది. నేరం జరిగాక ఏం చేశామన్నదానికంటే, అసలు నేరాలు జరగకుండా అడ్డుకోవడమే ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరం చేస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవన్న భయం నేరగాళ్లలో కలిగినప్పుడే వీటిని అరికట్టగలమని తెలిపింది.

కఠిన చర్యలకు వెనుకాడొద్దు

మహిళలపై నేరాల కట్టడికి పోలీసులు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని కోర్టు సూచించింది. ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినా వెనుకాడొద్దని, మానవ హక్కుల వంటి సమస్యలు ఎదురైనా అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో నిరంతర పెట్రోలింగ్‌‌‌‌ను మరింత పెంచాలని, సీసీటీవీలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూడాలని ఆదేశించింది.

సుమోటోగా విచారణ

ఇటీవల ఢిల్లీలోని ఓ పార్కులో 17 ఏండ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతకుముందు స్వరూప్ నగర్‌‌‌‌లో ఓ టీనేజీ బాలికపై కొందరు దుండగులు గ్యాంగ్‌‌‌‌రేప్ చేసి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై లైంగిక దాడి కూడా జరిగింది. ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, వీటిపై సుమోటోగా విచారణ చేపట్టింది.