అమెరికా చరిత్రలోనే అత్యంత ఎక్కువకాలం ఖైదీగా జైలులో గడిపిన ఫ్రాన్సిస్ క్లిఫోర్డ్ స్మిత్ (101) కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా అంటే 70 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆయన, కనెక్టికట్‌లోని ఒక వృద్ధాశ్రమంలో పెరోల్‌పై ఉన్న సమయంలో మరణించారు.
1949 జూలైలో కనెక్టికట్‌లోని ఒక యాచ్ క్లబ్‌లో జరిగిన దోపిడీలో 68 ఏళ్ల నైట్ వాచ్ మెన్ గ్రోవర్ హార్ట్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో స్మిత్‌ను దోషిగా తేలుస్తూ 1950 జూన్‌లో కోర్టు ఎలక్ట్రిక్ కుర్చీపై మరణశిక్ష విధించింది. అయితే, తన జీవితాంతం తాను నిర్దోషినని, ఆ హత్య జరిగిన చోట తాను అసలు లేనే లేనని స్మిత్ చెబుతూ వచ్చారు.
8 సార్లు మరణం అంచు దాకా..
మరణశిక్ష పడిన తర్వాత స్మిత్ చట్టపరమైన పోరాటం ఒక వింతైన మలుపులు తిరిగింది. శిక్ష అమలు కావడానికి కొద్ది సమయం ఉందనగా ఏకంగా 8 సార్లు ఆయన ఉరిశిక్ష వాయిదా పడింది. ప్రతిసారి "చివరి కోరిక" కింద పెట్టే ఆఖరి భోజనాన్ని కూడా తిని, చివరి నిమిషంలో చావు నుండి బయటపడ్డారు.
*1951లో ఒక సాక్షి తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడంతో శిక్ష ఆగిపోయింది.
*1954లో ఉరి తీయడానికి కేవలం రెండు గంటల సమయం ఉందనగా, ఆయన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా (జీవిత ఖైదు) మార్చారు.
70 ఏళ్ల జైలు జీవితం:
శిక్ష తగ్గినా ఆయన జీవితం ఎక్కువ భాగం జైలులోనే గడిచింది. 1967లో 12 రోజుల పాటు జైలు నుంచి పారిపోవడం, 1975లో కొద్దిరోజులు పెరోల్ రావడం మినహా ఆయన జీవితమంతా కనెక్టికట్ జైలు గోడల మధ్యే గడిచింది.
చివరకు ఆయన వయసు పైబడటం, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2020 జూలైలో (దాదాపు 69 ఏళ్ల జైలు జీవితం తర్వాత) పెరోల్ బోర్డు ఆయనను వృద్ధాశ్రమానికి తరలించింది. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
