అమెరికాలో విజృంభిస్తున్న తట్టు.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూయార్క్ స్టేట్

అమెరికాలో విజృంభిస్తున్న తట్టు.. హెల్త్  ఎమర్జెన్సీ  ప్రకటించిన న్యూయార్క్ స్టేట్

అమెరికా వంటి అభివృద్ధి చెందిన, టెక్నాలజీలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసే, ఆర్థికంగా అగ్రశక్తిగా ఉన్న దేశంలో తట్టు వంటి టీకాతో నివారించగల వ్యాధి మళ్లీ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లో గ్రామీణ ప్రాంతాల్లో తట్టు కేసులు వేగంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2026లో అమెరికా వ్యాప్తంగా తట్టు కేసులు ఇప్పటికే గత ఏడాది నమోదైన సంఖ్యను దాటడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో తట్టు (Measles) కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అక్టోబర్ 5న జారీ చేసిన ఉత్తర్వు నవంబర్ 4 వరకు అమల్లో ఉండనుంది. తట్టు వ్యాప్తిని అడ్డుకునేందుకు టీకాలు, పరీక్షలను వేగంగా నిర్వహించడం వంటి చర్యలు వేగవంతం చేసింది. 

అక్టోబర్ 3 వరకు న్యూయార్క్‌లో మొత్తం 108 తట్టు కేసులు నమోదు కాగా.. వీటిలో 7 కేసులు న్యూయార్క్ నగరంలో, 101 కేసులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి . ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అధికంగా ఉన్నాయి. జూలై 15 నుంచి 18 కౌంటీల్లో 92 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

తట్టు అత్యంత వేగంగా వ్యాపించే వైరస్. దద్దుర్లు కనిపించడానికి నాలుగు రోజుల ముందే ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకితే నిమోనియా, మెదడు వాపు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 2026లో అమెరికా వ్యాప్తంగా తట్టు కేసులు గత ఏడాది సంఖ్యను దాటాయి. పెన్సిల్వేనియా, సౌత్ కరోలినా, ఉటా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లోనూ అధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు తమ టీకా వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే MMR టీకా తీసుకోవాలని అధికారులు సూచించారు.