న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలోనే రూ.2 నుంచి రూ.8 మేర ధరలు పెరిగాయి. ధరల ఆకస్మిక పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను ఎక్కువగా వినియోగించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. E20 పెట్రోల్ తయారీ కోసం చక్కెరను పెద్ద ఎత్తున మళ్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో చక్కెర ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
షుగర్ రేట్ల ఆకస్మిక పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి వైపు చక్కెరను మళ్లించడమే ప్రధాన కారణమన్న ఆరోపణలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశంలో ఊహించిన దానికంటే తక్కువ చక్కెర ఉత్పత్తి, పండుగ సీజన్‌కు ముందు పెరిగిన డిమాండ్, వాతావరణ సంబంధిత పంట నష్టం, ప్రపంచవ్యాప్తంగా సరఫరాలు తగ్గడం చక్కెర ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వివరణ ఇచ్చింది.
►ALSO READ | ఈరోజుల్లో అందరికీ షుగర్ ఉంది.. పంచదార రేటు పెరిగినా పెద్ద మేటర్ కాదు: బీహార్ మంత్రి ప్రకటన
వ్యాపారుల దగ్గర భారీ నిల్వలు, ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలు కూడా రేట్ల పెరుగుదలకు ఒక కారణమని పేర్కొంది. కేవలం ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పడం సరికాదని తెలిపింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం వినియోగించే చక్కెర వాటా గతం కంటే ఇప్పుడు ఇంకా తగ్గిందని వెల్లడించింది.
ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12 శాతం ఉండగా.. 2025-26 సీజన్ నాటికి అది 9 శాతానికి పడిపోయిందని తెలిపింది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరకు బదులుగా మొక్కజొన్న వంటి ధాన్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. చక్కెర ధరలలో ప్రస్తుత పెరుగుదలను ఇథనాల్ ఉత్పత్తికి ముడిపెట్టడం సరికాదని పేర్కొంది.
