హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో గంజాయి తీసుకుంటున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 20 గ్రాముల డ్రై గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి మాత్రమే కాదు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం కూడా హైదరాబాద్ సిటీలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజుకో ఉదంతం వెలుగుచూస్తూనే ఉంది.
ఈగల్ ఫోర్స్ ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్ గుట్టురట్టు చేసింది. డ్రగ్ ట్రాఫికింగ్ నుంచి సంపాదించినట్లు ఆరోపణలు ఉన్న రూ.6 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్ గుర్తించారు. బోధన్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
32.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు గుర్తించారు. ఒక కెమికల్ ఫ్యాక్టరీ, 4 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విలువ రూ.2.5 కోట్లు, మార్కెట్ విలువ సుమారు రూ.6 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఈగల్ ఫోర్స్.. NDPS చట్టంలోని 68(F) కింద ఆస్తుల జప్తు చేసింది.
►ALSO READ | కూకట్ పల్లి Y జంక్షన్ దగ్గర KKR కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం... పరుగులు తీసిన జనం..
మరో పక్క.. బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలను కూడా పోలీసులు కట్టడి చేశారు. అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సరఫరాదారు గౌతమ్ సింగ్‌తో పాటు ఉప సరఫరాదారు, ఇద్దరు వినియోగదారులను అరెస్ట్ చేశారు.
రూ.1.85 లక్షల విలువైన ఇంజెక్షన్లు, వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గౌతమ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను తెప్పించి.. ఒక్కో వైయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి.. రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గోషా మహల్ ప్రాంతంలో కస్టమర్లకు భారీ ధరకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. బాడీ బిల్డింగ్, కండరాల పెంపు కోసం యువత ఈ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నట్లు పోలీసుల గుర్తించారు. 50 మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ వైయల్స్, 5 BD U-40 ఇన్సులిన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. 5 ఖాళీ వైయల్స్, బైక్, 4 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు తేలడంతో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
