టీచర్ కొడుతుందన్న భయంతో విశాఖలో ఆరేళ్ల బాలుడు గుండె ఆగిపోయి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ గుండెల్ని పిండేసే విషాద ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. ఆడుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఏడేళ్ల బాలుడు బస్సు డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దివ్యేష్ రత్వా అనే ఏడేళ్ల బాలుడు కుటుంబంతో కలిసి వడోదరలో ఉంటున్నాడు. గురువారం (ఆగస్ట్ 20) ఆడుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. నగర శివారులోని ఓ గ్యారేజీ దగ్గర నిలిపి ఉంచిన బస్సులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బస్సు డోర్ ఆకస్మాత్తుగా మూసుకుపోవడంతో బాలుడు అందులో ఇరుక్కుపోయాడు.
మెడకు తీవ్ర గాయం కావడంతో స్పృహా కోల్పోయాడు. కుమారుడు ఎంతకు ఇంటికీ రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలోనే గ్యారేజీ వద్దకు వెళ్లి చూడగా బాలుడు బస్సు డోర్లో ఇరుక్కుని అపస్మారక స్థితిలో కనిపించాడు. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణంచినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
