- అప్రమత్తంగా ఉండాలని ఏసీబీ ఆఫీసర్ల సూచన
మంచిర్యాల, వెలుగు: ఏసీబీ ఆఫీసర్లం అని చెప్పుకుంటూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సదరు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నంబర్లను సేకరించి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని, దాడులు చేసి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు.
ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏసీబీ అధికారులమని నమ్మిస్తూ, కేసు నమోదు కాకుండా ఉండాలంటే తాము చెప్పిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు నగదు ఇవ్వాలని లేదంటే ఫోన్ నంబర్‌కు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఏసీబీ అధికారులుగా చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. 9059208198 నంబర్ తో ఫోన్ చేసి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధికారులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు సూచించారు.
ఫోన్ చేసిన వ్యక్తి పేరు, హోదా, ఫోన్ నంబర్, మాట్లాడిన సమయం వంటి వివరాలను భద్రపరచుకొని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి ఫేక్ ఏసీబీ కాల్స్‌పై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 1064లో సంప్రదించాలని కోరారు.
