హైదరాబాద్, వెలుగు: సీఎల్పీలో తనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన విమర్శలపై త్వరలోనే స్పందిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించగా.. ప్రస్తుతం ఇంట్లో వరలక్ష్మీ పూజలో బిజీగా ఉన్నానని, ఇప్పుడు మాట్లాడేందుకు ఏమీ లేదని చెప్పారు.
తనపై వచ్చిన విమర్శలు, ఇతర అంశాలపై ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ ద్వారా వివరించానని సురేఖ తెలిపారు. త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతానన్నారు. పార్టీ వ్యవహారాలపై ప్రస్తుతం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ప్రస్తుతానికి ఏమీ మాట్లాడబోమని సురేఖ కూతురు సుస్మిత తెలిపారు. సీఎం రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై స్పందిస్తామని చెప్పారు.
