డీహెచ్ ఆఫీస్లో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్

డీహెచ్ ఆఫీస్లో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్
  • సమగ్ర విచారణకు రెండు కమిటీల ఏర్పాటు 

హైదరాబాద్, వెలుగు: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) కార్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ నేతృత్వంలో రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో మొదటి కమిటీ శుక్రవారం నుంచే విచారణను ప్రారంభించింది.

డీహెచ్ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో పేరుకుపోయిన ఫైళ్లు, వసూళ్ల పర్వంపై ఈ కమిటీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నర్సింగ్ సిబ్బంది ప్రొబేషన్ పీరియడ్ ముగిశాక సర్వీస్ రెగ్యులరైజేషన్ కోసం ఒక్కో ఉద్యోగి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోటీన్ పనులకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో విసిగిపోయిన ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో స్టాఫ్ నర్సులు, అటెండర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కార్యాలయ అడిషనల్ డైరెక్టర్‌‌‌‌తోపాటు మరో ఇద్దరు కలిసి బాధితుల నుంచి రూ. 19.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. దీనిపై జనవరిలోనే ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెండో విచారణ కమిటీలను నియమించింది.