- షోకాజ్ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- వనపర్తిలో కాంగ్రెస్‌ను కాపాడాలంటూ నినాదాలు
హైదరాబాద్, వెలుగు: ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ధర్నా చేశారు. వనపర్తి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి చిన్నారెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ‘వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను కాపాడాలి’, ‘చిన్నారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు.
మేఘారెడ్డి వల్ల నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని, ఆయన నుంచి కాంగ్రెస్‌ను కాపాడాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న చిన్నారెడ్డికి హైకమాండ్ న్యాయం చేయాలని వనపర్తి కాంగ్రెస్ నాయకులు కోరారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు.
