భారత్ vs ఆఫ్ఘన్ టీ20 సిరీస్.. పంజాబ్ క్రికెటర్లకు ఎందుకు తలనొప్పిగా మారిందంటే?

భారత్ vs ఆఫ్ఘన్ టీ20 సిరీస్.. పంజాబ్ క్రికెటర్లకు ఎందుకు తలనొప్పిగా మారిందంటే?

India vs Afghanistan: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఢిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్ జరిపేందుకు బీసీసీఐ, ఏసీబీ ఒప్పందం చేసుకోవడంతో టీమిండియా షెడ్యూల్ మరింత బిజీగా మారింది. ఈ సడన్ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు పంజాబ్‌కు చెందిన కొందరు స్టార్ క్రికెటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) నిర్వహించే షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు జరగనుంది. అదే సమయంలో ఇండియా-ఆఫ్ఘన్ టీ20 సిరీస్ కూడా రావడంతో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ లాంటి ఆటగాళ్లు అయోమయంలో పడ్డారు. జాతీయ జట్టుకా లేక సొంత రాష్ట లీగ్‌లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 

అభిషేక్, అర్ష్‌దీప్‌లకు తప్పని తిప్పలు: 

ప్రస్తుతం భారత టీ20 జట్టులో స్థిరంగా ఆడుతున్న అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఒకవేళ బిసిసిఐ వీరిని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఎంపిక చేస్తే, కచ్చితంగా పంజాబ్ లీగ్‌ను మధ్యలోనే వదిలేసి రావాల్సి ఉంటుంది. ఈ లీగ్ ప్రచారం మొత్తం గిల్, అభిషేక్ శర్మల చుట్టూనే జరిగింది. అలాంటిది వీరు సగం లీగ్ పూర్తి కాకుండానే వెళ్ళిపోతే ఫ్రాంచైజీలకు, నిర్వాహకులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. దీంతో ప్లేయర్లు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలా అని ఆలోచనలో పడ్డారు.

సడన్‌గా డీల్ సెట్.. బీసీసీఐ నెక్స్ట్ మూవ్?: 

అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం బీసీసీఐ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమే. తొలుత ప్రకటించిన లిస్ట్ ప్రకారం ఆగస్టు 27న శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుకు సెప్టెంబర్ చివరి వారంలో వెస్టిండీస్ సిరీస్ వరకు పెద్దగా మ్యాచ్‌లు లేవు.. ఈ గ్యాప్‌ను గమనించే పంజాబ్ క్రికెట్ బోర్డు తమ లీగ్ షెడ్యూల్‌ను లాక్ చేసింది. కానీ బీసీసీఐ, ఏసీబీ మధ్య సడన్‌గా చర్చలు జరిగి ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఖరారు కావడంతో ఈ క్లాష్ ఏర్పడింది. మరి ఈ స్టార్ ప్లేయర్లను లీగ్ మధ్యలో వచ్చేందుకు అనుమతిస్తారా లేక వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఈ సిరీస్ నుంచి తప్పిస్తారా అనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. 

పంజాబ్ స్టార్ క్రికెటర్ల జాబితా ఇదే: 

* ఫాజిల్కా ఫాల్కన్స్ (శుభ్‌మన్ గిల్)

* అమృత్‌సర్ సూర్మాస్ (అభిషేక్ శర్మ)

* లూధియానా లయన్స్ (అర్ష్‌దీప్ సింగ్)

* జలంధర్ వారియర్స్ (ప్రభ్‌సిమ్రన్ సింగ్)

* మొహాలీ కింగ్స్ (రమణ్‌దీప్ సింగ్)

* భటిండా రాయల్స్ (గుర్నూర్‌ బ్రార్)