హైదరాబాద్, వెలుగు: ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం లేఖ రాశారు. దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు 50 శాతం సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని, కోర్టు తీర్పును అధిగమించి ఏ రాష్ట్రం 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర కులగణన చేపట్టారని తెలిపారు. కులగణన వివరాలు కోర్టుల ముందు ఉంచినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి తాము ఎట్టి పరిస్థితుల్లో 50 శాతం రిజర్వేషన్లు పరిమితి దాటడానికి వీలులేదని.. రెండు రాష్ట్రాల్లో పెంచిన బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా స్టే విధించిందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని మోదీతో భేటీ జరపాలని డిమాండ్ చేశారు.
