గోషామహల్, వెలుగు: బాడీ బిల్డింగ్, కండరాల పెరుగుదల పేరుతో మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అమ్మతున్న ముఠాను హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్), గోషామహల్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు.
మంగళ్‌హాట్ శివ్‌లాల్‌నగర్‌కు చెందిన గౌతమ్ సింగ్(24), జుమ్మేరాత్ బజార్‌కు చెందిన ఆర్.అభిలాష్ (19) జిమ్‌లో స్నేహితులు. కండరాల పెరుగుదల కోసం అభిలాష్ మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వినియోగించేవాడు. అతడి ద్వారా గౌతమ్ కూడా వాడడం స్టార్ట్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గౌతమ్ వాటిని అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
వాట్సాప్ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ సరఫరాదారుని సంప్రదించి.. షాడో ఫ్యాక్స్ కొరియర్ ద్వారా ఒక్కో వైయల్‌ను రూ.160కు తెప్పించుకునేవాడు. అనంతరం అభిలాష్ సహకారంతో గోషామహల్ ప్రాంతంలోని కస్టమర్లకు రూ.900 చొప్పున అమ్మేవాడు.
ఈక్రమంలో ఎంజే బ్రిడ్జి, భూలక్ష్మీ మాత ఆలయం వద్ద సిద్ధేష్ ఆండేకర్(19), దక్ష్ ఉపాధ్యాయ్(20)కు ఇంజెక్షన్లు అమ్మేందుకు గౌతమ్ బైక్ పై వచ్చాడు. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 50 మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్, ఐదు బీడీయూ-40 ఇన్సులిన్ ఇంజెక్షన్లు, ఐదు ఖాళీ వైయల్స్, బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గోషామహల్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ తెలిపారు.
